ఖైరతాబాద్, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, ప్రజల సొమ్ముతో హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన ఏ మాత్రం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘విద్యకు బడ్జెట్ పెంపు’ అనే అంశంపై ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఎం వెంకట్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకోలేక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే, అక్కడ సరైన సౌకర్యాలు లేక, ఉపాధ్యాయుల కొరతతో మధ్యలోనే చదువులకు స్వస్తి పలుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ బడులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు కొమ్ముకాస్తున్నదని, పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కేవలం 7 శాతం కేటాయించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం ఉచిత విద్యను అందించాల్సి ఉండగా, అది ఎక్కడా అమలుకావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలనపై సోయి లేదని, అన్ని మంత్రి పదవులు ఆయన వద్దే పెట్టుకొని అన్ని శాఖలను నిర్వీర్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మెస్సీ మ్యాచ్‌లు, అందాల పోటీలకు సమయం ఉంది కానీ, విద్యాభివృద్ధి కోసం రివ్యూలు, బడ్జెట్, విద్యా పాలసీ రూపొందించడానికి వీలు దొరకట్లేదా? అని ప్రశ్నించారు.
ప్రతి మండలానికి అధునాత సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలలను నిర్మిస్తామని ఊదరగొట్టే హామీలు ఇచ్చి విస్మరించారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అన్నివర్గాల కోసం గురుకులాలను ఏర్పాటుచేశారని, ఎందరో పేద విద్యార్థులకు విద్య అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, పేదలకు విద్య అందే పరిస్థితి లేదని పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పగించి దోపిడీ వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులు కేటాయించి విద్యా రంగాన్ని కార్పొరేటీకరణ నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యకు సరిపడా నిధులు కేటాయించక, పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో పేదలు తమ శక్తికి మించిన భారంతో పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థలకు పంపాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, గత బడ్జెట్లో 8 శాతం కూడా కేటాయించలేదని విమర్శించారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యావ్యవస్థపై గొప్పగొప్ప మాటలు చెబుతాయని, కానీ కనీసం విద్యార్థినులకు టాయిలెట్లు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవని, టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థినులు కనీసం మంచినీళ్లు తాగలేని పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఆ కారణంగా చాలామంది విద్యకు దూరమవుతున్నట్టు తెలిపారు. ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారని, ఆర్నెళ్ల క్రితం ఉస్మానియాలో 109 మంది విద్యార్థినులకు పరీక్షలు చేయగా వారి కిడ్నీలు దెబ్బతిన్నట్టు తేలిందని చెప్పారు.
ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో సౌకర్యాలు లేవని, ఫలితంగా బాలబాలికలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడిందని, ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో శానిటరీ న్యాప్కిన్లు ఇచ్చేవారని, నేడు ఇవ్వడం లేదని చెప్పారు. సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, గంజి వేణుగోపాల్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గద్వాల టౌన్, ఫిబ్రవరి 5: ‘ఎన్నికల నుంచి తప్పుకో.. లేదంటే సుపారీ ఇచ్చి చంపిస్తాం’.. అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి రాజ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశాడు. గద్వాల మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రాజ్‌కుమార్ గురువారం గద్వాల ఇన్చార్జి హనుమంతు నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనతోపాటు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు సైతం బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు.