‘అమ్మా.. నీవు దేవమార్గాన్ని వదిలి, భూమి మీదికి రావాలి. ఒట్టిపోయిన సాగరాన్ని జలంతో నింపాలి..’అని నాడు భగీరథుడు గంగాదేవిని వేడుకున్నాడు. ఆయన హిమాలయాల్లో చేసిన ఘోర తపస్సుకు కరుణించి గంగ దేవి నుంచి భువికి దిగి వచ్చింది. అందుకే ఇప్పటికీ ఏదైనా పట్టు వదలకుండా చేసే ప్రయత్నాన్ని భగీరథ యత్నంగా అతిశయోక్తికి వాడుతూ ఉంటారు.
అది వాస్తవ చరిత్రనో? లేక ఇతిహాస కథనో! కానీ.. నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిజంగా భగీరథుడే. నదీ జలాలను ఇండ్ల ముంగిటకు రప్పించిన ఆయన ఆలోచన రాష్ట్రం, దేశమే కాదు, ప్రపంచమే అబ్బురపడే అంశం. మిషన్ భగీరథ పథకం పేరుతో ఇంటింటికీ సురక్షిత నదీ జలాలను సరఫరా చేస్తూ ప్రజలకు తాగునీటి సమస్య అనేదే లేకుండా చేయడమనే అసాధారణ ప్రయత్నాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఆయన దక్కించుకున్నారు.
సాగునీటి జలగళలతో ‘తెలంగాణను కోట్లాది ఎకరాల మాగాణి’గా చేసిన ఆ మహనీయుడు..శతాబ్దాల నాటి తాగునీటి సమస్యను పూర్తిగా తీర్చడం ఎంతో కొనియాడదగిన విషయం. నేటి, రాబోయే తరం దాహార్తిని తీర్చిన ఘనమైన చరిత ఆయన పేరిట లిఖితమైనది. తెలంగాణ రాక మునుపు పల్లెల్లో నీటిగోస ఎట్లుండేదో తెలుసుకుంటే జడుసు పుడుతది. నాడు నల్లాల కాడ సిగపట్లు.. బోరింగుల (చేతిపంపులు) ముందు పడరాని పాట్లు.. బిందెలు నెత్తికెత్తుకొని బావుల వద్దకు మహిళల అగచాట్లు..అబ్బో ఒకటేమిటి..నిత్యగోస తప్పేది కాదు.
ఇలా రోజూ దినసరి పనులతోపాటు నీటికోసం కూడా పొద్దంతా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించేది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలోని గిరిజన గూడేల్లో నీటి వెతలు అంతా ఇంతా కాదు. సమీపంలో బావులు లేక, ఆనాటి పాలకులు పట్టించుకోక చెలిమలు తవ్వుకొని గిరిజనం తమ దాహార్తిని తీర్చుకునేవారంటే తీవ్రత ఎలా ఉండేదో దీన్నిబట్టే తెలుసుకోవచ్చు.
ఇదంతా ఒకెత్తయితే.. నల్లగొండ జిల్లాది మరొక ఎత్తు. కొన్నేండ్లపాటు ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు నరకయాతన అనుభవించారు. జిల్లాలోని సుమారు 40 గ్రామాల్లో ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. సాధారణంగా తాగునీటిలో 0.5 నుంచి 1 పీపీఎం ఉండాల్సిన ఫ్లోరైడ్ శాతం మర్రిగూడ, నాంపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో అత్యధికంగా 28 శాతం వరకూ ఉండేదంటే ఎంతటి తీవ్రతో అర్థం చేసుకోవచ్చు. ఇరువై ఐదేండ్లకే కాళ్లు, చేతులు వంకర తేలి నేలకే పరిమితమై వేలాదిమంది అగచాట్లు పడేవారు. తమ పనులు తాము చేసుకోలేని నిస్సహాయ స్థితి లో మగ్గేవారు. ఎందరో మధ్యలోనే తనువు చాలిస్తూ ఉండేవారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను బాధితులు స్వయంగా కలిసి తమ గోస విన్నవించినా ఆ పెద్ద మనుసులు కరుగలేదు.
నాడు ఉద్యమనేతగా కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో 2003లో పర్యటించారు. ఆయా మండలాల్లో ఆయన మూడురోజులు పర్యటించి, అక్కడే బసచేశారు. ఫ్లోరైడ్ పీడితుల ఇండ్లకు స్వయంగా వెళ్లి వారి గోస విని చలించిపోయారు. గుక్కెడు నీళ్లు కరువై అంధకారమైన జీవితాలను చూసి కన్నీరుకార్చారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన ఆయన మహిళల నీటిగోస కండ్లారా చూసి వ్యథాభరితుడయ్యారు.
సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ 1998లోనే ‘సిద్దిపేట సమగ్ర తాగునీటి పథకం’ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో అమలు చేశారు. ఇలా ఆ రెండు సందర్భాల నుంచి పుట్టుకొచ్చిందే మిషన్ భగీరథ పథకం అని చెప్తారు. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేశారు.
ఆయన సంకల్పంతో రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ 2016 ఆగస్టు 7న ఆయన ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో ఏర్పాటు చేసిన పథకం పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆవిష్కరించి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రూ.42 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి రాష్ట్రంలో 25 వేలకు పైగా గ్రామాలకు అన్ని నగరాలు, పట్టణాలకు కృష్ణా, గోదావరి, ఇతర నదీ జలాల నుంచి స్వచ్ఛమైన తాగునీటిగా మార్చి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. 1.30 లక్షల కిలోమీటర్లకు పైగా పైపులైన్ వేయగా, 45,000కు పైగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి 34 వేల మిలియన్ క్యూబిక్, కృష్ణానది నుంచి 21.5 వేల క్యూబిక్ నీటిని మిషన్ భగీరథకు వినియోగిస్తారు. అందుకే కేసీఆర్ లేకుంటే.. కేసీఆరే రాకుంటే.. మిషన్ భగీరథ పథకాన్ని తేకుంటే.. ఇంకా ఎన్ని దశాబ్దాలైనా తెలంగాణ తాగునీటి గోస తీరేది కాదు.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
బొమ్మకంటి భిక్షమయ్యగౌడ్ 9705347798