భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నది. అభివృద్ధిని మరవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, తదితర కారణాలతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. అభ్యర్థుల ఎంపిక హస్తం పార్టీకి తలనొప్పిగా మారడంతో పాటు చివరి క్షణంలో జాబితా విడుదల చేసింది. స్వయంగా సీఎం జరిపించిన సర్వేలోనూ ఇక్క డ పార్టీ వీక్‌గా ఉన్నట్లు తేలింది. గత స్థానిక ఎన్నికల్లో మంత్రులు పర్యటించినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదని గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8న మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయ డానికి నిర్ణయించినట్లు తెలిసింది.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : గత రెండు విడతల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలో పాగా వేసిన బీఆర్ఎస్ మరోమారు జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి జరిపించిన సర్వేలోనూ ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించి రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి భూపాలపల్లికి దిగొస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా ఇంత ఆపసోపాలు పడాల్సి రావడం ఏంటని వాపోతున్నారు. మొత్తం మీద ఈ నెల 8న సీఎం భూపాలపల్లి పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపల్ ఏరియాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, సీఎం పర్యటన జాబితాలో భూపాలపల్లి ఉందని తెలుస్తున్నది.
2014, 2020లో రెండు దఫాలుగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతిపక్షాలు దరిదాపుల్లోకి చేరుకోలేదు. బండారి సంపూర్ణ, సెగ్గం వెంకటరాణిలు చైర్పర్సన్లుగా వ్యవహరించారు. 30 వార్డులున్న భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంతో సీఎం భూపాలపల్లిపై ప్రత్యేక దృష్టి సారించి సర్వే జరిపించినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రిపీట్ అవుతాయనే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా తన పర్యటన జాబితాలో భూపాలపల్లిని చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే మంత్రులను సైతం రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
గడిచిన రెండేళ్లలో భూపాలపల్లి పట్టణ అభివృద్ధి ముందుకు సాగకపోవడం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే వార్డుల్లో శిలాఫలకాలు ఏర్పాటు చేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయడం, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగడం, జోరుగా డబ్బులు వసూలు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం తదితర కారణాలతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా వార్డుల్లో పోటీదారుల సంఖ్య పెరగడం, అనంతరం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉపసంహరించుకోవడం, ఒక్కచోట కూడా రెబల్స్ లేకపోవడం లాంటి కమిట్మెంట్తో బీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మళ్లీ హామీలతో ప్రజాభిమానం కూడగట్టుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తుంది. సీఎం పర్యటన ఆ పార్టీ అభ్యర్థులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.