సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టసుఖాల్లో అండగా ఉంటున్నానని, ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి నంగునూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నంగునూరు అంటేనే ఎంతో నమ్మకం, భరోసా అన్నారు. సీఎం కేసీఆర్‌కు సైతం నంగునూరు మండలం కోనాయిపల్లి సెంటిమెంట్ ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట విద్యాలయాల హబ్‌గా మారిందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, రైతులకు పంట రుణమాఫీ చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే మళ్లీ దొంగరాత్రి కరెంట్ వస్తుందని.. రిస్క్ వద్దని, ప్రజలతో మళ్లీ కారుకే ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
నంగునూరు, నవంబర్ 24: సిద్దిపేట ప్రజలే నా కుటంబ సభ్యులుగా భావించి.. అన్ని రకాలుగా సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన నంగునూరులో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నంగునూరు అంటేనే తనకు ఎంతో నమ్మకం, భరోసా అన్నారు. సీఎం కేసీఆర్‌కు సైతం నంగునూరు మండలం కోనాయిపల్లి సెంటిమెంట్ అన్నారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తుంటే కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడ 5 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణలో రైతుబంధుతో అన్నదాతలకు భరోసా కల్పించామన్నారు. మండలంలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల తర్వాత పెన్షన్ వచ్చే వారందరికీ రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. కరోనా సమయంలో నా కుటుంబ సభ్యులని భావించే అందరికీ సేవ చేశానని చెప్పారు. సర్కార్ దవాఖానలను బాగు చేసుకున్నామని.. మోకాలి మార్పి డి, డయాలసిస్, ఐసీయూ వంటి సౌకర్యాలు కల్పించుకున్నట్లు తెలిపారు.
సిద్దిపేట చదువులకు నిలయంగా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అన్ని రకాల చదువులు సిద్దిపేటలో ఉన్నాయన్నారు. రూ.300 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నంగునూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. నా కుటుంబ సభ్యులని భావించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రుణమాఫీ 75 శాతం పూర్తయిందని.. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఈసారి పేదలందరికీ ఇండ్లు కట్టిచ్చే కార్యక్రమం చేస్తామన్నారు. నాడు పని దొరుకుతలేదు అనే పరిస్థితి ఉండే.. కానీ నేడు కైకిలోల్లు దొరుకుతలేరనే పరిస్థితి వచ్చిందన్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి కానీ అతి విశ్వాసంతో ఉండకూడదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విష ప్రచారాలను కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే మళ్లీ దొంగరాత్రి కరెంట్ వస్తుందని.. రిస్క్ వద్దని మళ్లీ కారుకే ఓటు వేయించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, రాష్ట్ర ఆయిల్‌పామ్ వెల్ఫేర్ సొసైటీ వైస్ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.