రామచంద్రాపురం, జూన్ 10: సీఎం కేసీఆర్ దేశం మెచ్చిన నాయకుడని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రశంసిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంత్రి శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ఉస్మాన్‌నగర్‌లో ఏర్పాటుచేసిన కొల్లూర్ పోలీస్‌స్టేషన్‌ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం తెల్లాపూర్ గ్రామంలో బీరప్ప, మల్లికార్జునస్వామి, విశ్వకర్మ ఆలయాల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతోపాటు ఆయా సామాజికవర్గాల నాయకులు మంత్రి హరీశ్‌రావును, ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘గతంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర మంత్రి రేవన్న నాకు ఫోన్ చేసి సీఎం కేసీఆర్ అపాయింట్మెట్ కావాలని అడిగారు. మా సీఎంను ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడిగాను. గొల్లకురుమల సామాజికవర్గానికి చెందిన సీఎంగా ఉన్నా మా జాతికి ఇన్ని గొర్రెలు ఇవ్వడేమో అని చెప్పాడు. ఆ తర్వాత వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి సన్మానించాడు.. గొర్రెల పంపిణీ బాగుంది.. మా ఆత్మగౌరవం కోసం భవనం కట్టిస్తే ఇంకా బాగుంటుందని కోరడంతో కోకాపేటలో భూమి మంజూరు చేశారు. ఇప్పుడు ఆ భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, రేవన్న కేసీఆర్‌ను కలిసిన విషయం తెలుసుకున్న ఢిల్లీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. మా జాతికి మంచి చేస్తుండని కృతజ్ఞతలు తెలిపాను, పార్టీలో ఉండమంటే ఉంటా, లేదంటే పోతా.. అనడంతో హైకమాండ్ మౌనంగా ఉండిపోయింది. గొర్రెల పంపిణీ పథకాన్ని ఇతర రాష్ర్టాల నేతలు ప్రశంసిస్తున్నారు’.. అని మంత్రి తెలిపారు.
కుల వృత్తులకు అండగా…
కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రపంచీకరణ, మోడ్రనైజేషన్‌తో కులవృత్తుల వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. వారిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ రూ.లక్ష పథకాన్ని ప్రారంభించారని, బీసీ కులవృత్తులవారు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
నిఖార్సైన నాయకురాలు లలితాసోమిరెడ్డి…
తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి నీతికి, నిజాయితికి మారుపేరు అని మంత్రి హరీశ్‌రావు కితాబునిచ్చారు. చాలా మంది వార్డు మెంబర్ పదవికి రాజీనామా పెట్టాలంటేనే ఆలోచిస్తారని, కాని ప్రజలకు ఇచ్చిన మాట కోసం పదవి కన్నా మాటే ముఖ్యమని పదవినే వదులుకోవడానికి సిద్ధపడిన నిఖార్సైన నాయకురాలు అని కొనియాడారు. ఆమె రాజీనామా చేసిన తర్వాత సోమిరెడ్డికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కల్వదు.. ఎవరికీ దొరుకుత లేడు.. కలెక్టర్‌ను రాజీనామా ఆమోదించమని అడుగుతుండు.. ఇైట్లెతే కాదని ఎంతో కష్టపడి మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి గ్రామ అవసరాలకు 6 ఎకరాల భూమిని మంజూరు చేయిస్తే మెల్లగా శాలువా, పూలమాల పట్టుకొని నా దగ్గరకు వచ్చారని మంత్రి చెప్పారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను కాపాడుకోవాలన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన భూమిలో చక్కగా మున్సిపల్ భవనం, సబ్‌స్టేషన్, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, ఆలయాలను నిర్మించుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించేందుకు కొల్లూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూతన పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, కార్పొరేటర్ పుష్పానగేశ్, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి, జ్యోతీశ్రీకాంత్రెడ్డి, బాబ్జీ, చిట్టి ఉమేశ్వర్, సుచరితాకొమురయ్య, శ్రీశైలం, నాగరాజు, కో-ఆప్షన్ సభ్యులు శ్రీపాల్‌రెడ్డి, జయలక్ష్మి, సౌందర్య, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ నర్సింహరావు, ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్, ఏస్సై శశికాంత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ జయరాం, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిద్ధిపేటతో సమానంగా పటాన్చెరు అభివృద్ధి…
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సిద్ధిపేటతో సమానంగా పటాన్చెరు అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు సహకారం అందజేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంత్రి సహకారంతో త్వరలోనే పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజలకు మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఉస్మాన్‌నగర్, కొల్లూర్‌కు ఐటీ హబ్‌లు రాబోతున్నాయన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలు గమనించాలని తెలిపారు.