సిద్దిపేట అర్బన్, నవంబర్ 28 : ‘ఈ దేశంలో అవార్డులంటూ ఇస్తే.. సిద్దిపేట పేరు లేకుండా ఉం డదు. అవార్డు అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే అవార్డు అన్నట్లుగా అభివృద్ధి చేసుకున్నాం’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం జరిగిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో ప్రేమతో ప్రతిసారి మెజార్టీ పెంచుతూ వచ్చిన మీ అందరికీ ఈ జన్మ అంకితమన్నారు. మీరు చూపిన ప్రేమ.. ఆదరాభిమానాలు వెలకట్టలేనివన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లా, రైలు, గోదావరి జలాలు వచ్చాయన్నారు. తనపై ప్రేమతో కార్యకర్తలందరూ ఒక్కో హరీశ్‌రావులా మారి కష్టపడి పని చేశారన్నారు. నాడు చుక్క నీరు లేని సిద్దిపేటకు నేడు సముద్రాన్ని తలపించే రెండు జలాశయాలు వచ్చాయన్నారు. సిద్దిపేట అంటే ఒక రోల్ మోడల్‌గా మార్చుకున్నామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎన్నో విమర్శలు చేశారని, వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. సిద్దిపేటలో 1000పడకల దవాఖానతో పేదలకు వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. రెండు పంటలకు సాగునీరు అందించి రైతులకు భరోసా ఇచ్చామన్నారు.
లీడర్లంటే ఎన్నికలప్పుడు తిరుగుతారు.. కానీ నేను ఐదేండ్లపాటు రేపు ఎలక్షన్ అనే విధంగా పని చేశానన్నారు. కష్టాలు, పండుగల్లో ఉన్నానని, సిద్దిపేటనే తన కుటుంబం అనుకొని ప్రతి పండుగ సిద్దిపేటలోనే జరుపుకున్నాని తెలిపారు. ఎవరికి కష్టమొచ్చినా ఆ దేవుడు ఇచ్చినా శక్తి మేరకు మీకు సేవ చేశానన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కష్టాలు, సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. కార్యకర్తల ఉత్సాహమే కారు, కేసీఆర్‌కు ఇంధనమన్నారు. మీరే బలం, బలగమన్నారు. కార్యకర్తలు ఈ రెండు రోజులపాటు కష్టపడి పని చేసి సిద్దిపేట పేరును రాష్ట్రంలో, దేశంలో మార్మోగేలా చేయాలన్నారు. పోలింగ్ శాతం పెంచి.. ప్రతి ఓటు కారుకు పడేలా చూడాలన్నారు. మనం వేసే ఓటు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్‌కు, ఆసరా పెన్షన్ ఇచ్చే కేసీఆర్‌కు, బీడీ పింఛన్ ఇచ్చిన కేసీఆర్, మనం వేసే ఓటు మంచినీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు అన్నారు. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని అడిగారు. కొంతమంది తెలంగాణ ద్రోహులు ఓట్ల కోసం బయల్దేరారని, ఎప్పుడైనా తెలంగాణ కోసం పోరాడారా..
తెలంగాణ కోసం రాజీనామా చేశారా.. తెలంగాణ కోసం దీక్ష చేశారా అని ప్రశ్నించారు. అన్నీ చేసి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని.. కానీ, కుర్చీ కోసం బయల్దేరారని మండిపడ్డారు. గతి లేని సంసారం నడపవచ్చు కానీ.. సుతి లేని సంసారం నడపరాదని ఓ సామెత ఉందని, ఈ కాంగ్రెస్ వాళ్లది సుతిలేని సంసారమన్నారు. తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ల చేతికి రాష్ట్రం పోతే కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారుతుందన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే ఉండాలన్నారు. ప్రతిఒక్క కార్యకర్త సిద్దిపేటతోపాటు చుట్టు పక్కల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఓటు వేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల చైర్పర్సన్ మంజులారాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజితావేణుగోపాల్రెడ్డి, ఎంపీపీలు మాణిక్యరెడ్డి, బాలకృష్ణ యాదవ్‌తోపాటు ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్ నవంబర్ 28 : సిద్దిపేట గులాబీమయం అయింది. మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన రోడ్ షో జనసంద్రం తలపించింది. సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నర్సాపూర్ చౌరస్తా నుంచి లాల్ కమాన్ గాంధీ చౌరస్తా మీదుగా కాంచీట్ చౌరస్తా గణేశ్‌నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రభుత్వ దవాఖాన మీదుగా ముస్తాబాద్ చౌరస్తా వరకు కొన సాగింది. అక్కడి నుంచి ఎక్బాల్ మినార్, హైస్కూల్ చౌరస్తా, విక్టరీ టాకీస్, పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు హరీశ్‌రావుకు స్వాగతం పలికారు. ప్రజలు ఆయా చౌరస్తాల వద్ద మంత్రి హరీశ్‌రావుకు గజమాలలతో సత్కరించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద కౌన్సిలర్ దీప్తీనాగరాజు ప్రభుత్వ పథకాలతో ఏర్పాటు చేసిన గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. మంత్రి హరీశ్‌రావుపై అభిమానంతో పట్టణంలో అన్నివర్గాల ప్రజలు రోడ్ షో ర్యాలీకి హాజరై తమ ప్రేమను చాటుకున్నారు.