సంగారెడ్డి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): రైతు లు ఎదుర్కొంటున్న పంట రుణమాఫీ సమస్యలపై బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించలేదు. రైతు రుణమాఫీ అమలులోని లోపాలు సరిదిద్దేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారని రైతులు, రైతుసంఘాలు ఆశించినా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ ప్రజలు కాలుష్యం సమస్యపై ఆందోళన చేస్తు న్నా సమావేశంలో కాలుష్యనివారణపై లోతుగా చర్చించలేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కోనింటి మాణిక్రావు తమ నియోజకవర్గాల సమస్యలను లేవనెత్తి పరిష్కరించాల్సిందిగా మంత్రులను కోరా రు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని కోరారు. రైతులందరికీ పంటరుణమాఫీ వర్తింప చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న పెద్దాపూర్, గిర్మాపూర్తోపాటు ఇతర ప్రాంతాల రైతులకు భూమికి బదులు అంతే విలువ చేసే భూమి ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి నియోజకజవర్గంలోని రహదారుల పనుల కోసం ఎంఆర్ఆర్లో మంజూరైన రూ.10.40 కోట్ల పనులు చేపట్టాలని, ఎస్డీఎఫ్, సీఎం ప్రత్యేక నిధులతో మంజూరైన రూ.29.33 కోట్ల పనులు చేపట్టాలని కోరారు.
కంది, సదాశివపేట ఎంపీపీ కార్యాలయ భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, మినీ హాజ్హౌస్ నిర్మాణానికి రూ.2.5 కోట్లు ఇవ్వాలని కోరారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మా ట్లాడుతూ పిరమిల్, గిరిధర్ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మంజీరానదిలోకి కాలుష్యం జలాలు వదులుతున్నారని, దీనికి అడ్డుకట్టవేయాలని కోరారు. న్యాల్కల్లో ఫార్మా విలేజ్ నిర్మాణం కోసం 2వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఝరాసంగం ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి రూ.5 కోట్లు, నియోజకవర్గంలో రహదారుల పనులకు రూ.7.20 కోట్లు ఇవ్వాలని కోరారు.