పుల్కల్, జూలై 17: రైతుల డిమాండ్లు, బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు సాగుకు సింగూరు జలాలను విడుదల చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం గంగమ్మ తల్లికి పూజలు చేసి లిప్ట్ ద్వారా సింగూరు ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేశారు. సీసీ లైనింగ్ పనుల పేరుతో సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు కింద రెండు పంటలకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించడంతో పంటలు సాగుకాక వివిధ గ్రామా లకు చెందిన ఆయకట్టు రైతులు నష్టపోయారు. గురువారం సింగూరు జలాలు విడుదల చేయడంతో రైతులు పంటలు సాగుచేయనున్నారు. నిత్యం 120 క్యూసెక్కుల జలా లు కాల్వల ద్వారా దిగువకు వెళ్తాయని ఇరిగేషన్ ఈఈ భీమ్ తెలిపారు. ముందుగా 20 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సాగునీరు పుల్కల్, చౌటకూర్, అందోల్ మండలాల్లోని కాల్వల కింద వేసిన పొలాలకు వెళ్తాయని ఆయన తెలిపారు.
సింగూరు కెనాల్ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేసిన మంత్రి దామోదర రాజనర్సింహా అనంతరం పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా విద్యాలయాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్,మోడల్ స్కూల్ ప్రిన్స్పాల్లకు సూచించారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆర్వో ప్లాంట్, డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రి వెంట అందోల్ ఆర్డీవో పాండు, తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ డీఈ నాగరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్, మల్లారెడి,్డ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఉదయ్, ఎన్ఎస్యూఐ నాయకులు ఇమ్రాన్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.