మిరుదొడ్డి, జూలై 10: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరగాయలతో కాకుండా నీళ్లచారుతో వడ్డిస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే డబ్బులు సరిపోక పోవడంతో పాటు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వంట నిర్వాహకులు అరకొర కూరగాయలు, నీళ్లచారు విద్యార్థులకు ఆహారంలో వడ్డిస్తున్నారు.
అంతేకాకుండా అధికారుల పర్యవేక్షణ లోపంతో కూడా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం లభించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నామని గొప్పలు చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.