పటాన్చెరు, జూలై 2: మెట్రో రైలు సంగారెడ్డి జిల్లాకు మణిహారం కాబోతున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్ర సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ మెట్రో రైలును మంజూరు చేయడంపై బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఇస్నాపూర్ చౌరస్తాలో సంబురాలు చేశారు. బాణాసంచా కాల్చి సీఎం జిందాబాద్‌లతో, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు మినీ ఇండియా ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ప్రజల చిరకాల డిమాండ్ అయిన మెట్రో రైలును మియాపూర్ నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు పొడిగించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
సీఎం కేసీఆర్ పటాన్‌చెరుకు ఒకేరోజు డబుల్ ధమాకా కానుక అందజేశారన్నారు. మెట్రోరైలుతో పాటు తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడం తన అదృష్టం అని పేర్కొన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దానికి న్యాయం చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్సీకి నామినేట్ చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు మెట్రోరైలు పటాన్చెరు పారిశ్రామికవాడకు అవసరమని గుర్తించి మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారన్నారు. ఈ ప్రాంతం మెట్రో రావడంతో వ్యాపారపరంగా, రియల్ఎస్టేట్ రంగంలోనూ మరింత పుంజుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ పటాన్చెరు మండలాధ్యక్షుడు బీ పాండు, వైస్ ఎంపీపీ సుష్మాశ్రీశ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీ పాండు, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, అఫ్జల్, సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్, కృష్ణయాదవ్, మాజీ సర్పంచ్ బురిగారి వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్‌గుప్తా, గోల్కొండ లక్ష్మణ్, గోపాల్, మెరాజ్‌ఖాన్, రాజేశ్, రామకృష్ణ ముదిరాజ్, యాదగిరిముదిరాజ్, రవి తదితరులు పాల్గొన్నారు.