సంగారెడ్డి, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ సంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ గురువారం సెలవు ప్రకటించింది. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారు కంట్రోల్‌రూమ్‌లోని 08455-276155 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
బుధవారం జిల్లా సరాసరి 3.80 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని రెండు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 22 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మునిపల్లి మండలంలో అత్యధికంగా 15 మి.మీటర్ల వర్షంపాతం నమోదైంది. వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. బుధవారం జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు నియోజవర్గాల్లో జోరుగా వర్షం కురిసింది. వర్షాలతో జహీరాబాద్‌లోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో అల్గోల్-భరత్ నగర్-పొట్పల్లి వెళ్లే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. బూచినెల్లి-కర్ణాటక వెళ్లే రహదారి మూసివేశారు. వర్షాలతో జహీరాబాద్ పట్టణంలోని వసంత్ విహార్ కాలనీ, ఆదర్శ్‌నగర్ కాలనీ జలమయం అయ్యాయి. వర్షాలతో అందోలు నియోజకవర్గంలోని రోడ్డు దెబ్బతిన్నాయి.
వట్పల్లి మండలంలోని వట్పల్లి -గొర్రెకల్, వట్పల్లి-అల్లాదుర్గం, రాయికోడ్-సిరూర్, చౌటకూరు-పన్యాల రోడ్డు, అందోలు మండలంలోని ఇటిక్యాల్-బస్వాపూర్ రోడ్డు దెబ్బతింది. జోగిపేట-చింతకుంట రోడ్డుచాముండేశ్వరి రోడ్డు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి పట్టణంలోని పలు రహదారులు వర్షం నీటితో జలమయం అయ్యాయి. పటాన్చెరు పట్టణంలోని రహదారులపై వర్షంనీరు వచ్చి చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య నెలకొంది. వర్షాలకు సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టుల్లోకి వరద వస్తున్నది. నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పంటపొలాల్లోకి నారింజ వాగు నీళ్లు ముంచెత్తాయి.
మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 13: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మండలంలో 39.2 మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ధూళిమిట్ట, లింగాపూర్ చెక్‌డ్యామ్‌లు మత్తడి దుంకుతున్నాయి. తోర్నాల మోయతుమ్మెద వాగు పొంగిపొర్లుతున్నది.
కూటిగల్ నల్ల చెరువులోకి నీరు పెద్ద ఎత్తున చేరుతున్నది. ధూళిమిట్ట చెక్‌డ్యామ్ మత్తడి పోస్తుండడంతో తహసీల్దార్ మధుసూదన్, ఎస్సై మహబూబ్ అలీ చెక్‌డ్యామ్ వద్ద సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు చెక్‌డ్యామ్ మత్తడి దాటకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అడ్డుపెట్టారు. బైరాన్‌పల్లి హైస్కూల్ వద్ద రోడ్డుపై భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎస్సై మహబూబ్ అలీ గ్రామస్తులతో కలిసి చెట్టును తొలిగించారు. తహసీల్దార్ మధుసూదన్ మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.
పుల్కల్, ఆగస్టు 13 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. వర్షాలకు ప్రాజెక్టులోకి బుధవారం 4336 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు డీఈ నాగరాజు తెలిపారు.దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 11వ క్రస్ట్ గేటు 1.5 మీటర్లు పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
02
క్రస్ట్ గేటు ద్వారా 7694 క్యూసెక్కులు,జెన్కో ద్వారా 1265 క్యూసెక్కులు మొత్తంగా 8959 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటినిల్వ సామర్ధ్యం 29.917 టీఎంసీలు కాగా, 22.284 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద వస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు,గొర్రెల కాపరులు,పశువులు కాపరులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
జహీరాబాద్, ఆగస్టు 13: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోజ్ పంకజ్ సూచించారు. బుధవారం జహీరాబాద్ మండలంలోని రాయిపల్లి(డి), బూచినెల్లి, కొత్తూర్(బి), న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామాల శివారులోని నారింజవాగు ప్రాజెక్టు, వాగులు, కల్వర్టులను, వరదను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ నీటి వనరులపై అధికారులు, సిబ్బంది నిఘా పెట్టాలని సూచించారు. వాగులు, కల్వర్టుల గుండా వరద పారితే బారికేడ్లు, ముళ్లపొదలు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనదారులు అటువైపు వెళ్లకుండా, సెల్పీలు దిగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం బూచినెల్లిలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. వారి వెంట జహీరాబాద్ ఆర్టీవో రాంరెడ్డి, డీఎస్పీ సైదా నాయక్, ఇరిగేషన్ డీఈఈ విజయ్‌కుమార్, తహసీల్దార్లు దశరథ్, ప్రభు ఉన్నారు.
చిన్నకోడూరు, ఆగస్టు 13: భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అలర్ట్‌గా ఉండాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం చిన్నకోడూరుతో పాటు డారం, మేడిపల్లి చర్ల అంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఆమె పర్యటించారు. చిన్నకోడూరులో బ్రాహ్మణ చెరువు మత్తడి దూకుతూ లో లెవెల్ వంతెన పై నుంచి వరద ప్రవహిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నీటి ఉధృతి పెరిగితే రాకపోకలు నిలిపివేయాలని సూచించారు.
చిన్నకోడూరు, పెద్దకోడూరు గ్రామాల మధ్య నిర్మించే రైల్వే బ్రిడ్జి కింద అండర్ పాస్ పూర్తిగా నీట మునగడంతో నీరు వెళ్లే వరకు రాకపోకలు నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బ్రిడ్జి పకన తాతాలికంగా బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. డారం, మేడిపల్లి గ్రామంలోని పలు పురాతన వంతెనలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చర్ల అంకిరెడ్డిపల్లి శివారులో శనిగరం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముంపు ప్రభావానికి గురవుతున్న బాధిత కుటుంబాలకు గ్రామంలోని సురక్షిత ప్రాంతంలో 25 మందికి ఇంటి స్థలాలను ప్రభుత్వం అందించిందని, వారికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు కేటాయించాలని గ్రామస్తులు కోరారు.