పటాన్చెరు టౌన్, జూన్ 27 : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఏడాది కావస్తున్న సందర్భంగా ఈనెల 30న పారిశ్రామికవాడలో మృతుల జ్ఞాపకార్థం బీఆర్ఎస్ నాయకులు సంస్మరణ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మోటె సుమలత శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాశమైలారంలో సంస్మరణ సభ పోస్టర్‌ను ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. సిగాచి పేలుడు ఘటనలో 55 మంది మృతి చెందగా, 12 మందికి గాయాలు అయ్యాయని, ఈ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తి కావస్తున్నా, ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు పూర్తిగా చెల్లించకపోవడం దురదృష్టకరం అన్నారు. బాధిత కుటుంబసభ్యులకు సంఘీభావంగా ఈనెల 30న పారిశ్రామికవాడలోని బీపీఎల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలు, కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, బీఆర్ఎస్వీ నాయకులు మేరాజ్‌ఖాన్, కౌన్సిలర్లు కిశోర్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజు, నవీన్‌రెడ్డి, వెంకటేశ్, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, నాయకులు మాణిక్‌యాదవ్, పాశమైలారం బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.