Fake Certificate | నర్సాపూర్, మే 6 : ఓ మీ సేవ నిర్వాహకుడు డబ్బులకు కక్కుర్తి పడి దొంగ సర్టిఫికెట్లను సృష్టించిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన దుర్గయ్య, అమృత దంపతులకు 2009లో నర్సాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కుమార్తె జన్మించింది. పాప జనన (బర్త్) ధ్రువీకరణ పత్రం కోసం 2020లో కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్లోని ఒక మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు.
సాధారణంగా మీ సేవాలో దరఖాస్తు చేస్తే, అది సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణ అనంతరం డిజిటల్ సంతకంతో జారీ కావాలి. కానీ మీ సేవ నిర్వాహకుడు ఈ నిబంధనలను పాటించకుండా వారి వద్ద నుంచి రూ.2 వేలు వసూలు చేసి ఒక సర్టిఫికెట్‌ను చేతిలో పెట్టాడు. తమ కుమార్తె ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసే క్రమంలో సదరు సర్టిఫికెట్‌ను స్కాన్ చేయగా, అది ఆన్లైన్లో చూపించ లేదు. పైగా అది నకిలీదని అక్కడి వారు తేల్చి చెప్పారు. దీంతో కంగారు పడ్డ బాధితులు మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోని సిబ్బందిని సంప్రదించారు. వారు ఆ పత్రాన్ని పరిశీలించి ఇది మున్సిపల్ కార్యాలయం నుంచి జారీ కాలేదని, పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు.
2021లో జారీ అయిన ఈ సర్టిఫికెట్‌పై కృష్ణ అనే అధికారి సంతకం ఉంది. అయితే ఆ సమయంలో నర్సాపూర్‌లో ఆ పేరుతో ఎవరూ మున్సి పల్ కమిషనర్‌గా లేకపోవడం గమనార్హం.మీ సేవా కేంద్రం నిర్వాహకులే ఎవరో ఒకరి పేరుతో ఫోర్జరీ సంతకం చేసి నకిలీ ముద్రలు వేసి మోసం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది నిర్ధారించారు. కొత్త సర్టిఫికెట్ కోసం మళ్లీ ఆర్డీవో కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో నిరాశతో వెనుదిరిగారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మీ సేవా కేంద్రాల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గ్రామీణులు బలైపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.