అందోల్, జనవరి 21 : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో పేద రోగులకు వైద్యసేవలు సరిగ్గా అందడం లేదు. జోగిపేటలోని ప్రభుత్వ 100 పడకల ఏరి యా దవాఖానలో మొత్తం 23 మంది వైద్యులు ఉన్నారు. కానీ, నిత్యం విధుల్లో 10 12 మందికి మించి ఉండడం లేదు. దీంతో రోగులకు వైద్యసేవలు అందడం లేదు. కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ తరుచూ తనిఖీలకు వచ్చి హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. డోంట్‌కేర్ అన్నట్లు ఇష్టారాజ్యంగా వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పేదలు సర్కార్ దవాఖానకు రావాడానికి ఇష్టపడడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గ కేంద్రం జోగిపేటలోని దవాఖానలో అన్నిరకాల రోగాలకు చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేసి వైద్యు లు, సిబ్బందిని నియమించినా ఫలితం లేకుండా పోతున్నది.
అన్నీ ఉన్నా…
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా పరిస్థితి ఉంది. సకల సౌలతులు..సరిపోను వైద్యులు ఉన్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమో…లేదా నిర్ల్లక్ష్యాన్ని చూసీచూడనట్లు వదిలేయడమో కానీ, వైద్యుల తీరుతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, సమయపాలన పాటించక పోవడంతో ఆగ్ర హం వ్యక్తం చేశారు. 13మంది వైద్యులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు.
ఆ తర్వాత ఈనెల 3న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ జోగిపేట దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేమ్‌సీన్ రిపీట్ అవ్వడంతో ఆయన సైతం వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లారు. బుధవారం మళ్లీ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ జోగిపేట దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసినా మార్పురాక పోగా మరీ దారుణంగా తయారైంది. 23మ ంది వైద్యులకు కేవలం ఐదురుగు మాత్రమే సమయానికి రాగా, మరో ఆరుగురు వైద్యులు కమిషనర్ వెళ్లే సమయంలో వచ్చారు. మొత్తం 13 మంది వైద్యులు రైర్హాజరయ్యారు.
అటెండెన్స్ రిజిస్టర్లో అందరూ హాజరైనట్లు సంతకాలు సైతం చేసినట్లు తెలిసింది. దీంతో వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ అజయ్‌కుమార్, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులపై రిమా ర్కు రాసి సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. సాక్షాత్తు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలోనే ప్రభు త్వ వైద్యుల తీరు ఇలా ఉంటే, మిగ తా చోట్ల ఎలా ఉం టుందో అనే విమర్శలు వినిపిస్తున్నాయి.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా మంత్రి దామోదర, కలెక్టర్ ప్రావీణ్య చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.