చేర్యాల, ఫిబ్రవరి 17 : సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యసేవలకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీలో వైద్యులను చూపించుకుని మందులు తీసుకోవాలంటే రోగులకు చుక్కలు కనబడుతున్నాయి.సోమవారం దవాఖానలో వైద్యులు పరీక్షలు చేసే గది ముందర పదుల సంఖ్యలో గర్భిణులు, చిన్న పిల్లలను చంకన ఎత్తుకుని తల్లులు వైద్యం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. దవాఖానలో వైద్యురాలికి తెలుగు రాకపోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు ఆమెకు తమ అనారోగ్య సమస్య వివరించ లేకపోతున్నారు. ఆ వైద్యురాలి పక్కన కుర్చివేసి కిందిస్థ్ధాయి సిబ్బంది(ఎఫ్ఎన్వో) ఒకరిని నియమించారు. రోగులు ఆమెకు తమ అనారోగ్య సమస్య చెబితే ఆమె వైద్యురాలికి విషయం చెప్పి మందులు, పరీక్షలను చిటీపైన రాయిస్తున్నది.
నెల రోజులుగా దవాఖానలో ఇదే పరిస్థితి ఉండడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యురాలి గది వద్ద చిన్నపిల్లలను ఎత్తుకొని తల్లులు గంటలపాటు వేచి ఉండడంపై బీఆర్ఎస్ నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య వైద్యురాలి వద్దకు వెళ్లి ప్రశ్నించారు.గంటల పాటు తల్లులు నిలబడి ఉండలేరని, ఓపీ చీటీపై క్రమసంఖ్య వేసి వారిని కూర్చోబెడితే వరస క్రమంలో పిలిస్తే వారు వచ్చి తమ సమస్యను వైద్యులకు తెలియజేస్తారన్నారు.తల్లులను, గర్భిణులను గంటలపాటు నిలబెట్టడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై దవాఖాన ఇన్చార్జి వైద్యుడు దేవేందర్తో ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా.. రోగులను తాము కూర్చోమని చెబుతున్నా వారే కూర్చోవడం లేదన్నారు. వైద్యురాలికి తెలుగు భాష రాక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పగా, ఆ పీజీ వైద్యురాలు వారంలో ఒకరోజు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తారని, ఆమెతో మాట్లాడేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.