గజ్వేల్, జూలై 15: గ్రామీణ ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని గతంలో ఏర్పాటు చేసిన పీహెచ్సీ కేంద్రాల్లో గ్రామీణ ప్రాంత రోగులకు అంతంత మాత్రంగా వైద్యసేవలు అందుతున్నాయి. గజ్వేల్ డివిజన్ పరిధిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గజ్వేల్‌లో జిల్లా దవాఖాన, మాతాశిశు, బస్తీ దవాఖాలున్నాయి. అందులో వర్గల్, ములుగు, మ ర్కూక్, సింగన్నగూడ, తిగుల్, జగదేవ్‌పూర్, కుకునూర్‌పల్లి, కొండపాక, అహ్మదీపూర్, రాయపోల్, ఇందుప్రియాల్ల్లో పీహెచ్సీ కేంద్రాలుండగా వీటిలో ప్రధానంగా ఆయా గ్రామాలకు చెందిన రోగులే రోజూ సాధారణ చికిత్సల కోసం వస్తుంటారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఎక్కువగా వైర ల్ ఫీవర్, దగ్గు, జలుబు, కీళ్లనొప్పులు వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
ఈ కేంద్రాల్లో ఓపీ సేవలను అధికంగా నిరుపేదలే వినియోగించుకుంటున్నారు. అయినా రోజూ వచ్చే రోగులకు అవసరమైన మందులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న వాటినే ఇస్తూ కాలం వెల్లదీస్తున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం పీహెచ్సీ కేంద్రాల్లో మందుల కొరత కారణంగా రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా వైరల్ ఫీవర్ అధికంగా వస్తుండడంతో ప్రభుత్వం వాటిని కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గ్రామీణ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వసతులు నామమాత్రంగానే ఉన్నాయి. గజ్వేల్ జిల్లా దవాఖానకు వచ్చే రోగులకు చికిత్స అనంతరం సరిపడా మందు లు ఇవ్వకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు రాసిన మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ దుకాణాల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమస్య ప్రతిరోజూ చాలామందికి ఎదురవుతున్నది. మందుల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామని రోగి తరఫున బంధువులు వాపోతున్నారు.