కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 2 : కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పీహెచ్‌సీతో పాటు పీహెచ్సీ పరిధిలోని సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉంచేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా సూచించారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు 100శాతం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం కొండపాక మండ లం దుద్దెడ శివారులోని అన్నపూర్ణ పారాబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్‌ను పరిశీలించారు. వడ్లను రారైస్‌గా మార్చే వివరాలను మేనేజర్ రామ్మోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం నిల్వ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని డీఎస్వోకు సూచించారు. కలెక్టర్ వెంట హెచ్‌ఈవో రమణ, స్టాఫ్ నర్సు కమల, ఫార్మాసిస్టు దామోదర్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 2: వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుం డా చూడాలని కలెక్టర్ ఎం.మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీడీవో, ఎంపీవో, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులతో తాగునీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, వడదెబ్బ నివారణ జాగ్రత్తలపై అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సజావుగా తాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలన్నారు.జిల్లాలో ఉన్న 980 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంతో పాటు అన్ని మౌలిక సౌకర్యాల కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.