న్యాల్కల్, జూన్ 21: మండలంలోని మామిడ్గి గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సందర్శించారు. శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన మామిడ్గిలో డెంగీ కలకలం అనే వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు. జిల్లా మలేరియా అధికారి ప్రవీణ్‌కుమార్, మండల అభివృద్ధి అధికారి సురేశ్ గ్రామాన్ని సందర్శించారు. బీదర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారి వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించారు.
వారికి సోకింది డెంగీ సస్పెక్టెడ్ కేసులన్నారు. డెంగీ అని నిర్థారించలేమన్నారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ఇంటింటికెళ్లి వైద్యసిబ్బంది సర్వేలు చేపట్టడమే కాకుండా జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నామని తెలిపారు. వారం రోజులపాటు గ్రామంలో వైద్య క్యాంపును కొనసాగిస్తామన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎవరైనా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారు వైద్యాధికారులను సంప్రదించి పరీక్షలు చేసుకోవాలన్నారు. వారి వెంట మామిడ్గి ఆరోగ్య ఉప కేంద్ర వైద్యాధికారి హర్షవర్ధన్‌రెడ్డి, సిబ్బంది మల్లికార్జున్, చండీదేవి, ఎన్‌ఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు.