మెదక్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కేసీఆర్ పాలనలో మెదక్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల నిర్మాణం చేసింది. దేశ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ పాలనలో వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. కేసీఆర్ హయాంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో మెదక్‌లో పసుపులేరు బ్రిడ్జి రోడ్డు, చేగుంట రోడ్డు బ్రిడ్జి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎంసీహెచ్ దవాఖాన, క్రిటికల్ కేర్ భవనం, డేకేర్ భవనం, మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్, షాదీఖానా, రైతు బజార్, పెద్ద బజార్ రోడ్డు, గ్రంథాలయ భవనం, బ్లడ్ బ్యాంకు కేంద్రం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం,మెదక్-సిద్దిపేట, మెదక్ -బోధన రోడ్డు, స్టేడియం సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం ఉడెన్ వర్క్, ఎక్సైజ్ కార్యాలయం, సఖి కేంద్రం, పోలీస్ సిబ్బంది కోసం ఇండ్ల నిర్మాణం చేశారు. మెదక్ పట్టణంలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేసి, రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణం చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. తొమ్మిదేండ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు. 2014కు మందు మెదక్ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. పల్లెకు రోడ్డు సౌకర్య లేదు, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ హయాంలో మెదక్ రూపురేఖలు మారిపోయాయి.
వనదుర్గా ఘనపూర్ ప్రాజెక్టుకు మరమ్మతులు
వనదుర్గా ఘనపూర్ ప్రాజెక్టుకు మరమ్మతులకు కేసీఆర్ రూ. 50 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి వెంటనే రూ. 43.64 కోట్లు మంజూరు చేశారు. ఆయకట్ట ఎత్తు పెంచి 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యవసాయ భూములు సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ హయాంలో నిధులు మంజూరు చేశారు. ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచడంతో పాటు సాగు నీటి కాల్వలకు మరమ్మతులు చేసేందుకు రూ. 100 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు నిలిపివేసింది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ హయాం లో వానకాలం, యాసంగి పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేవారు. కాంగ్రెస్ హయాంలో నీటిని విడుదల చేయక రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ పాలనలో నిలిచిన అభివృద్ధి
కాంగ్రెస్ పాలనలో మెదక్‌లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను నిలిపివేశారు. రెండేం డ్లుగా కాంగ్రెస్ సర్కారు పనులు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలనలో మెదక్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కాలనీలో రోడ్ల సౌకర్యాలు లేక ఇక్కట్లు తప్పడం లేదు.తాగునీటి సమస్య ఉన్నా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మెదక్ పట్టణానికి బైపాస్ రోడ్డు లేదు. దీంతో పట్టణంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగిన సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. పీజీ కళాశాల లేక విద్యార్థులు హైదరాబాద్‌కు వెళాల్సిన పరిస్థితి వచ్చింది. మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్స్టేషన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మారిన మెదక్ రూపురేఖలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో అప్పటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ పట్టణంలో రూ. కోట్ల అభివృద్ధ్ది పనులు చేశారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు భవనాల నిర్మాణం చేసి అధికారులు అందుబాటులో ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు. మిషన్ భగీరథలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ. 454 కోట్లు ఖర్చు చేసి పైపులైన్లు, ట్యాంకులు, నల్లాలు ఏర్పాటు చేశారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలో రూ. 106 కోట్లతో పనులు చేసి ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించారు. నీటిపారులకు శాఖకు రూ. 400 కోట్లు కేటాయించి చెరువులకు మరమ్మతులు చేసి వ్యవసాయ పంటల సాగుకు సాగునీరు అందించారు.
మిషన్ కాకతీయకు రూ. 340 కోట్లు కేటాయించారు. రూ. 462 కోట్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్లుకు, రూ. 305 కోట్లు ఆర్‌అండ్‌బీశాఖ రోడ్లకు నిధులు కేటాయించి రోడ్లు వేశారు. రూ. 600 కోట్లు విద్యుత్ శాఖకు కేటాయించి సబ్‌స్టేషన్ స్థాయి పెంచడంతో పాటు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖకు రూ.100 కోట్లు మంజూరు చేసి రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించారు. ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరు చేశారు. మంజీరా, హల్దీవాగు పై 14 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేసి వ్యవసాయ పంటలకు సాగునీరు అందించారు. మెదక్ పట్టణంలో మెదక్ -బోధన్ చౌరస్తా నుంచి పసుకులేరు వాగు వరకు డివైడర్ నిర్మాణంతో పాటు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం చేశారు. రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెంటల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డివైడర్ నిర్మాణం చేశారు.