సిద్దిపేట, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలంగాణ భవన్లో నియోజక వర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌ను పార్లమెంట్ ఎన్పికలకు సన్నద్ధం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పని చేయాలి అని పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో క్యాడర్లో నూతన ఉత్తేజం వస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ స్థానంతోపాటు జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ సమావేశం ఇటీవల ముగిసింది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ తన సత్తా చాటుకుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలకు రెండు భారీ మెజార్టీతో గెలిపించుకొని మరో సారి సత్తాచాటేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఇటీవల శాసనసభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలు నిర్వహించి మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ కృతజ్ఞతా సభలు నిర్వహించారు. నేడు (గురువారం) గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం కృతజ్ఞతా సభను గజ్వేల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరుకానున్నారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లో కృతజ్ఞతా సభలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్‌ను పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధ్దం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి కాంగ్రెస్ విధానాలను ఎండగట్టేలా పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ ముందుకు కదులుతుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మెదక్ నుంచి వరుసగా ఐదు సార్లు…జహీరాబాద్ నుంచి వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచింది. మెదక్ లోకసభ పరిధిలోకి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. బీఆర్ఎస్ నుంచి 2004-09 వరకు ఆలే నరేంద్ర, 2009-14వరకు విజయశాంతి, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ శాసనసభ స్థానానికి, మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండింటికీ పోటీ చేసి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం కొత్త ప్రభాకర్‌రెడ్డి మెజార్టీతో విజయం సాధించారు. వరుసగా మెదక్ నుంచి బీఆర్ఎస్ ఐదు సార్లు ఘన విజయం సాధించింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెదక్ మినహా అన్ని శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక జిల్లాలోని రెండో పార్లమెంట్ నియోజకవర్గమైన జహీరాబాద్ పరిధిలో జహీరాబాద్, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. 2014-2019, 2019 ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ ఘన విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మూడో సారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టేలా బీఆర్ఎస్ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలోని జుక్కల్, ఎల్లారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్‌లో (కాంగ్రెస్), కామారెడ్డి( బీజేపీ), బాన్స్వాడ, జహీరాబాద్‌లో ( బీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు.
బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అనేక విజయాలను అందించింది మెతుకు గడ్డ. తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యతను కనబర్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభ స్థానాలకు 2014లో 8 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే అనారోగ్య కారణంతో మరణించగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి గెలుపొందారు. దీంతో 10కి తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 2018 ఎన్నికల ఫలితాల్లో 10 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. తదనంతరం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2020లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో స్పల్ప ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాగా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్‌లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అన్ని మండల పరిషత్‌లతో పాటు, గ్రామాల సర్పంచ్‌లు ఇలా అన్నింటా బీఆర్ఎస్ నిలిచింది. జిల్లాలో 95 శాతానికి పైగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది శాసనసభ స్థానాలకు ఏడు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది. 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2014లో రెండు, 2018లో ఒక స్థానం, 2023లో మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రతి ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు.