దుబ్బాక, ఆగస్టు 31: ‘తెలంగాణ అంటే సీఎం కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం. స్వరాష్ట్రంలో రెండుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుపెట్టాను. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం దుబ్బాకకు సేవ చేసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’.. అని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక నియోజవకర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ వెంట నడిచా. ఉద్యమం నుంచే ఆయనతో అనుబంధం ఏర్పడింది. అదే నారాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది. ఆనాటి నుంచి నేటివరకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారులో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాల పంపిణీలో భాగస్వామిగా ఉండడం ఆనందాన్నిచ్చింది. తొమ్మిదేండ్లుగా ఎంపీగా ఉంటూ సొంత జిల్లాకు సేవ చేసుకునే అవకాశం దక్కింది. ఇప్పుడు సొంత నియోజకవర్గం దుబ్బాకకు సేవలందించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: సీఎం కేసీఆర్ నేతృత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం గర్వంగా ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా నాయకుడిగా, సేవకుడిగా అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా, స్వరాష్ట్రంలో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి తెలంగాణకు నిధుల కోసం పోరాడటం, రానున్న రోజుల్లో దుబ్బాక శాసనసభ నుంచి ప్రతినిత్యం వహించే అవకాశం దొరకడం నేనొక వరంగా భావిస్తున్నాను. ఇందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం
రుణపడి ఉంటాను.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: పనిచేసే ప్రతి కార్యకర్తకూ తప్పకుండా గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ప్రజల కోసం, పార్టీ పటిష్టం కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అవకాశవాద రాజకీయాలు చేసే వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఖద్దరు బట్టలు వేసుకున్నంత మాత్రాన నాయకుడు కాలేడు. ప్రజల్లో మమేకమై, వారికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన ప్రతి నాయకుడికీ, కార్యకర్తకూ గౌరవం ఉంటుంది. ప్రజాసేవ కోసం వచ్చే నాయకుడు స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి. ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలను, నాయకులను నమ్మి మోసపోవద్దు. ఇందుకు దుబ్బాక ఉపఎన్నికనే నిదర్శనం. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసగించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు ఓటును ఆలోచించి వేయాలి. మాయమాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోవద్దు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలి.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: సీఎం కేసీఆర్ నాకు దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మెదక్ నుంచి రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సొంత నియోజకవర్గం దుబ్బాక ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ చేస్తా. మంత్రి హరీశ్‌రావు సహకారంతో మరింత అభివృద్ధి చేస్తా.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ పరిధిలోని దుబ్బాక స్థానం నుంచి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన సీఎం కేసీఆర్, అక్కడి నుంచి నాకు తొలిసారిగా పోటీకి అవకాశం కల్పించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. మళ్లీ 2019లో రెండోసారి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందడంతో నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడం, సీఎం కేసీఆర్ సూచనల మేరకు దుబ్బాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించా. రెండుసార్లు ఎంపీగా, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండడం చాలా సంతోషంగా ఉంది.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: దుబ్బాక ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే నా బలం..బలగం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామరక్ష. దుబ్బాకలో నేను చేసిన అభివృద్ధి పనులే రానున్న ఎన్నికల్లో నా విజయానికి బాటలుగా మారనున్నాయి. నియోజకవర్గ ప్రజలు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలే నా విజయానికి సోపానాలు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాను. నిస్వార్థంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాను.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి: జిల్లాలో ప్రధాన రహదారులుకు సీఆర్ఎఫ్ నిధులు మంజూరుకు కృషిచేశాను. మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం, సిద్దిపేటకు రైల్వేలైన్ సౌకర్యం కల్పించడానికి కృషిచేశా. దుబ్బాక నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు, చెక్‌డ్యామ్‌లు, మల్లన్నసాగర్ నుంచి కాల్వల ద్వారా రైతులకు సాగునీరందించే అవకాశం దక్కింది. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశాం. దుబ్బాకలో రూ.21 కోట్లతో 100 పడకల దవాఖాన, రూ.15 కోట్లతో కేసీఆర్ బడి, రూ.4 కోట్లతో మోడల్ బస్టాండ్ భవనం, రూ.30 కోట్లతో ఐవోసీ భవనం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాలాజీ ఆలయ నిర్మాణం.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, కోర్టు భవనాలు త్వరలోనే నిర్మాణం చేపడతాం. నా సొంత నిధులతో చాలా కార్యక్రమాలు చేపట్టాను. 100 మంది దివ్యాంగులకు కోటి రూపాయలు వెచ్చించి త్రీవీలర్ వాహనాలు అందజేశాను. నియోజకవర్గంలో సుమారు 13 వేల మంది వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం రూ.3 కోట్లు వెచ్చిస్తున్నా.