నర్సాపూర్, జనవరి8: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కావాలంటే మహిళలకు ముగ్గులు వేసుకోడానికి డబ్బులు పంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ పట్టణంలో గురువారం నిర్వహించిన మున్సిపల్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘునందన్ రావు కౌన్సిలర్ అభ్యర్థులకు పైసలు పంచండని సూచించారు. ఎన్నికల్లో ఓట్లు రావాలంటే పైసలు పంచండి. వచ్చేది సంక్రాంతి పండగ కాబట్టి మీరు పోటీ చేసే కాలనీలో వంద ఇండ్లను టార్గెట్ చేసి.. రూ.500, రూ.1,000 పంచి ఓటర్లను ప్రలోభ పెట్టాలని స్వయంగా ఎంపీ చెప్పడం గమనార్హం.
‘ఎన్నికల్లో ఓట్లు రావాలంటే పైసలు పంచండి. వచ్చేది సంక్రాంతి పండగ కాబట్టి అభ్యర్థులు మీరు పోటీ చేసే కాలనీలో వంద ఇండ్లను టార్గెట్ చేసి.. ముగ్గులు వేసే మహిళల వద్దకు వెళ్లండి. వారికి రూ.500 ఇచ్చి జనవరి 10వ తేది నుండి 15వ తేది వరకు రంగులు కొనుక్కొని ముగ్గులు వేయాలని చెప్పండి. ఈ లెక్కన రూ.50 వేలు అవుతాయి. ఎన్నికల ముందురోజు రాత్రి పంచే డబ్బులంతా కూడా కావు’ అని ఎంపీ చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
మహిళలకు డబ్బులు పంచాలని చెబుతున్న ఎంపీ రఘునందన్ రావు
‘మహిళలకు డబ్బులు పంచాక ఓ కండీషన్ పెట్టండి. ఇంటి ముందు వేసే ముగ్గులో ఓ కమలం పువ్వు వేసేలా చూడాలని వారికి చెప్పండి. అంటే.. ముగ్గులో మన పార్టీ జెండా రంగులైన కాషాయం, ఆకుపచ్చ ఉండేలా చూడాలి అని వారికి చెప్పండి. ప్రతి రోజు వారి ఇళ్ల మీదుగా వెళ్ళేవారు ఆ ముగ్గును చూస్తే కమలం పువ్వు కనపడుతుంది. తద్వారా వారి బుర్రలో సైకలాజికల్ వార్ మొదలవుతుంది. ఆ తర్వాత ఎన్నికల సమంయలో ఓటర్లు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారు’ అని రఘునందన్ రావు తనమార్క్ రాజకీయాలను కౌన్సిలర్ పోటీకి సిద్ధమవుతున్న వారికి బోధించారు. అంతేకాదు ఇంకా ఓటర్లపైన ప్రేమ ఉంటే రంగులకు రూ.500 లకు బదులు రూ.1000 పంచాలని ఆయన సలహా ఇచ్చారు. ఎంపీ మాటలు విన్న బీజేపీ నాయకులు ‘ఇదేంటీ.. పైసలు పంచాలని ఓపెన్‌గా చెప్పేస్తున్నాడు’ అని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తాయిలాలకు లొంగి ఓటు వేయొద్దని చెప్పే ఓ ప్రజాప్రతినిధి ఇలా చెప్పడం ఏంటని పలువురు గుసగుసలాడుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్, బీజేపీ జిల్లా అద్యక్షుడు మల్లేశ్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.