సిద్దిపేట, మార్చి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర బడ్జెట్ మెతుకుసీమ ప్రజలను నిరాశకు గురిచేసింది. బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలను ప్రభుత్వం నీరుగార్చింది. రాష్ట్రంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రైతులకు చేయూత కరువై మెదక్ జిల్లాలో 75 మందికి పైగా, సిద్దిపేట జిల్లాల్లో 35, సంగారెడ్డి జిల్లాలో 25, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 135 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోయింది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇతర పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర శాసనసభలో బుధవారం 2025-26 ఆర్థ్ధిక సంవత్సరానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ జిల్లా రైతులు, యువత, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ వర్గాలను నిరాశకు గురిచేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రభుత్వం కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వరాల జల్లు కురిపించింది. అధికారంలోకి వచ్చాక వాటి అమలును మరిచింది. సంగారెడ్డి జిల్లాలోని నిమ్జ్ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు భూసేకరణ దశలోనే ఆగిపోయింది. పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. దీంతో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. నిమ్జ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఈ బడ్జెట్‌ను చూస్తే తెలుస్తుంది. గోదావరి జలాలు తెచ్చి సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
లక్షలాది ఎకరాలకు సాగునీరందించేందుకు రూపకల్పన చేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రాజెక్టులను పూర్తిచేయడం గురించి పట్టించుకోవడం లేదు. ఈ ఎత్తిపోతల పూర్తికి నిధులు కేటాయించలేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా ఆలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో పాటు టూరిజం సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. వీటికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పైసా నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టులను ఆపేసింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అనేక అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రోడ్లు, కాలువలు, సమీకృత మార్కెట్లు తదితర వాటి పూర్తికి ఎలాంటి నిధులు కేటాయించలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాల్వల ఆధునీకరణ, పెండింగ్ కాల్వల పనుల పూర్తికి నిధులు కేటాయించలేదు. రంగనాయక సాగర్, కొండ పోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను టూరిజం సర్క్యూట్ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. గౌరవెల్లి ప్రాజెక్టు, తపాస్‌పల్లి రిజర్వాయర్లను ప్రభుత్వం విస్మరించడంతో ఆయకట్టు రైతులకు తిప్పలు తప్పేలా లేవు. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో పనులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సంగారెడ్డి వరకు మెట్రో ఏర్పాటు చేయాలనే ప్రజల డిమాండ్ గురించి బడ్జెట్లో ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన తేలేదు. ఏ విధంగా చూసినా ఈ బడ్జెట్ జిల్లా ప్రజలకు సంతృప్తికరంగా లేదని చెప్పవచ్చు.
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 19: నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ప్రజలను వంచించేలా ఉంది బడ్జెట్. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్ధత వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న రూ.2500 గురించి బడ్జెట్లో నిధుల ఊసేలేదు. అందాల పోటీలకు మాత్రం రూ. 250 కోట్లు కేటాయించారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించక పోవడం బాధాకరం. రైతులకు ఇచ్చిన హామీలకు రూ. 42వేల కోట్లు అవసరం. కానీ, ఎక్కడా బడ్జెట్లో ఆ మేర నిధులు పెట్టకపోవడం చూస్తే మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థమవుతున్నది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రస్తావనే లేకపోవడం ఆవేదనకు గురిచేసింది. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణ డిమాండ్‌ను ప్రభుత్వం విస్మరించింది.
– చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే
సిద్దిపేట, మార్చి 19: రాష్ట్ర బడ్జెట్ పేరుగొప్ప ఊరు దిబ్బలా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. బడ్జెట్లో రైతులకు ప్రయోజనం చేకూర్చే అంశాలకు ప్రస్తావన లేదు. సాగునీటి రంగానికి కేవలం రూ.23 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. రైతులు, పేదలు, మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ లేదు. నిరుద్యోగ భృతికి కేటాయింపులు చేయలేదు. ఆసరా పెన్షన్ల పెంపు ఊసులేదు. మహిళలకు పావలా వడ్డీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెకలకు కేటాయింపులకు పొంతనలేదు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల కేటాయింపులు బడ్జెట్లో లేవు. బడ్జెట్ ప్రజలను మోసపూరితమైన మాటలతో మభ్యపెట్టేలా ఉంది.
– వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, సిద్దిపేట మాజీ జడ్పీ చైర్పర్సన్
వట్పల్లి: మోసం చేయడమే కాంగ్రెస్ నైజంగా ఉంది. వాస్తవ సరిస్థితులకు భిన్నంగా బడ్జెట్ ఉంది. కాంగ్రెస్ సర్కారు హామీలను, సంక్షేమాన్ని తుంగలో తొక్కింది. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. తీరా గద్దెనెక్కాక మోసం చేస్తున్నది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు మొండిచేయి చూపి సంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. దీనికి మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం చెప్పాలి. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాపై కక్ష సాధిస్తున్నది. నిధుల కేటాయింపుల్లో జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నది.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ మాజీ ఎమ్మెల్యే
మెదక్, మార్చి 19(నమస్తే తెలంగాణ): ‘నది దాటే వరకు ఓడ మల్లయ్య.. నది దాటినంక బోడ మల్లయ్య’ అనే చందంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అందులో ఏ ఒక హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నది. ప్రభుత్వ అసమర్ధతను ఈ బడ్జెట్ చాటి చెప్పింది. నిధుల కేటాయింపులో ఉమ్మడి మెదక్ జిల్లాకు రేవంత్ సర్కారు అన్యాయం చేస్తున్నది.
– శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ
నారాయణఖేడ్, మార్చి 19: రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అటకెక్కించినట్లు స్పష్టమవుతుంది. నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500, రూ.4వేల పింఛన్, తులం బంగారం తదితర పథకాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగలేదు. ఇక నీటిపారుదల శాఖకు పెద్దగా నిధులు కేటాయించలేదు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం, నల్లవాగు ప్రాజెక్టు, కాళేశ్వరం-19ఏ ప్యాకేజీలకు బడ్జెట్లో నిధులివ్వలేదు. ఇది అసంబద్ధమైన రీతిలో అనాలోచితంగా రూపొందించిన బడ్జెట్.
-ఎం.భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే
గజ్వేల్, మార్చి19: అంకెల గారెడీలా బడ్జెట్ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా కనిపించడం లేదు. ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపించింది.
– మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్, గజ్వేల్
నర్సాపూర్, మార్చి 19: బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదు. ఆరు గ్యారెంటీల ఊసే బడ్జెట్లో లేకుండా పోయింది. మహాలక్ష్మి పథకం అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసింది. రూ.4 వేల పెన్షన్, మహిళలకు స్కూటీలు బడ్జెట్లో లేనే లేదు. రైతుభరోసాకు నిధులు తక్కువగా పెట్టి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ గత బడ్జెట్లో రూ.31 వేల కోట్లు చేస్తామని చెప్పి ఇప్పుడు రూ.21వేల కోట్లు మాత్రమే చేసి చేతులు దులుపుకొన్నారు. అది కూడా అందరికీ మాఫీ కాలేదు. అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. సన్న వడ్లకు బోనస్ డబ్బులు చివరిలో కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ నిర్వాకంతో రేషన్ దుకాణాల్లో బియ్యం కొరత ఏర్పడింది. ప్రతినెలా 1వ తేదీలోపు రావాల్సిన బియ్యం నెల మధ్యలో వస్తున్నాయి. దీంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.11 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే అవి కాస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పెట్టారు. రాజీవ్ యువ వికాసం పథకం పారదర్శకంగా అమలు చేయాలి. బడ్జెట్ ఆశాజనకంగా లేదు.
– సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
జహీరాబాద్, మార్చి 19: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలకు సాగు నీరందించేందుకు లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ హయాంలో భూమి పూజ చేశాం. మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడలో పంపుహౌస్ కోసం భూమి పూజ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నది. వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అనేకసార్లు దీనిపై అసెంబ్లీలో విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జహీరాబాద్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడుతున్న నిమ్జ్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
– కొనింటి మాణిక్‌రావు,జహీరాబాద్ ఎమ్మెల్యే
సిద్దిపేట,మార్చి 19: రైతులు, మహిళలు, ఆటోవాలాలు, కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది. కులవృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగారం హామీని అమలు చేయడం లేదు. ఈ బడ్జెట్ ప్రగతి నిరోధకంగా ఉంది. ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు.
-పాల సాయిరాం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సిద్దిపేట