Nizampet Farmers | నిజాంపేట, జూన్ 20: యూరియా యాప్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సిద్దిపేట-మెదక్ రహదారిపై నిరసనలు తెలిపారు. యాప్‌ను రద్దు చేయాని.. పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని కోరారు.
యాప్ ద్వారా యూరియాను విక్రయించడం వల్ల స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్‌కు డబ్బులిస్తే.. యూరియా ఇంటికి వచ్చేదని అన్నారు. కానీ రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన యాప్ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. యాప్‌లో అయినా సరే యూరియా బుక్ చేసుకుందామంటే.. వెయ్యికి పైగా బస్తాలు క్షణాల్లోనే బుక్ అయిపోయాయని వస్తుందని.. యూరియా కొరత సమస్యను కూడా తీర్చాలని డిమాండ్ చేశారు.
రైతు వ్యతిరేక విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని రైతులు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వారికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా, రైతన్నల ధర్నాతో మెదక్-సిద్దిపేట రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎస్సై రాజేశ్ రైతులను సముదాయించి ధర్నానున విరమింపజేశారు.