గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తీజ్. ఆడపిల్లలు తమ ఆశలు నెరవేరాలని కోరుతూ తొమ్మిది రోజులపాటు ఉత్సాహంగా జరుపుకునే వేడుక. తమకు త్వరగా పెండ్లి జరగాలని, మంచి వరుడు దొరకాలని, పంటలు మంచిగా పండి అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ తీజ్ పండుగను గిరిజన యువతులు ఘనంగానిర్వహించుకుంటారు. బతుకమ్మ పండుగ ఆడినట్లుగా గోధుమ మొలకలతో తీజ్ బుట్టలను రూపొందించి, తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగలో గిరిజన యువతులు పాల్గొంటారు.
– సిద్దిపేట, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అక్కన్నపేట
సిద్దిపేట, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అక్కన్నపేట: బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ నిలుస్తున్నది. ప్రకృతిని ఆరాధించే బంజారాల తీజ్ వేడుకలను ఎంతో నియమ నిష్టలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. తీజ్ పండుగ అనేది బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో తీజ్ సంబరాలను జరుపుకొంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, తండాలకు మంచి జరగాలని కోరుకుంటారు. మంచి భర్త రావాలని బంజారా యువతులు ఎనిమిది రోజుల పాటు బుట్టలో గోధుమ మొలకలు పెంచి, వాటి చుట్టూ ఆడిపాడి తొమ్మిదో రోజు స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా ఆషాఢం మాసం నుంచి శ్రావణ మాసం ముగింపు వరకు (వినాయక చవితి పండుగలోగా) ఈ తీజ్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ తీజ్ ఉత్సవాల్లో తండాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఒకప్పుడు గిరిజన తండాల్లోనే జరుపుకొనే తీజ్ పండుగలను నేడు నగరాల్లో నివసిస్తున్న గిరిజనులు సైతం తీజ్ వేడుకలను వైభవంగా జరుపుకొంటున్నారు. తొమ్మిది రోజుల పాటు గిరిజనులు ఆటాపాటలతో అలరిస్తారు. ఈ తీజ్ వేడుకల్లో పెండ్లి కాని యువతులు ప్రత్యేకంగా నిలుస్తారు.
పండుగ నేపథ్యం
పూర్వం తండాల్లో వర్షాలు పడకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు వర్షాలు బాగా కురువాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, లోకం సుభిక్షంగా ఉండాలని దేవతలను వేడుకుంటూ తీజ్ పండుగ నిర్వహించేవారు. ఈ పండుగలో పెండ్లి కాని యువతులదే ప్రధాన పాత్ర. అదే సంప్రాదాయం ఇప్పటికి కొనసాగుతున్నది. లోక కల్యాణం కోసం, పెండ్లి కాని యువతులు భవిష్యత్లో సంసార జీవితం బాగుండాలని కోరుతూ నిర్వహించే ఈ పండుగ కాస్తా కాలక్రమేణా యువతులకు మంచి భర్త కోసం చేసే పండుగగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు కరువును తండా పొలిమేరలు దాటించే పండుగగా భావించేవారు. ప్రస్తుతం తీజ్ ఎప్పుడొస్తుందా? అని ఈతరం అమ్మాయిలు ఎదురుచూసే పండుగగా మారిపోయింది.
ఎప్పుడు నిర్వహిస్తారు?
తీజ్ పండుగను ఆషాఢ, శ్రావణ మాసాల్లో(వినాయక చవితి పండుగ లోగా) నిర్వహిస్తారు. పూర్వం చాలా ప్రాంతాల్లో ఈ రెండు మాసాల్లో వచ్చే మంగళవారాల్లో నిర్వహించేవారు. ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకునే ఈ పండుగను ప్రస్తుతం ఎక్కువశాతం మంది సెలువు దినాల్లో నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఉద్యోగం, ఉపాధి కోసం తండాలకు దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులను కూడా వేడుకలో భాగస్వామ్యం చేసే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. తీజ్, శీత్లా పండుగల నిర్వహణకు ప్రత్యేకమైన రోజంటూ ఏమీ లేదని కొందరు గిరిజన పెద్దలు చెబుతున్నారు. అయితే ఆషాఢం, శ్రావణం ఈ రెండు మాసాల్లో తీజ్ సందడి కనిపిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ రెండు మాసాల్లోని మంగళ, గురువారాల్లో శీత్లా, తీజ్ వేడుకలను జరుపుకోవడం ఆచారమంటున్నారు మరికొందరు గిరిజనులు.
గిరిజనులకు ఏడుగురు దేవతలు
గిరిజనులకు ప్రధానంగా ఏడుగురు దేవతలు ఉన్నారు. ఈ ఏడుగురు దేవతలు అక్కాచెల్లెళ్లేనని చెప్తారు. ఆ ఏడుగురు దేవతలే మేరామా, హింగ్లా, తుల్జా, శీత్లా, ద్వాలంఘర్, కంకాళీ, మంత్రాల్. గిరిజనులు ప్రధానంగా మేరామా, మంత్రాల్, శీత్లా, తుల్జా దేవతల పేరున పండుగలు నిర్వహిస్తారు. గిరిజనుల నమ్మకం ప్రకారం మేరామా దేవత తండాను రక్షిస్తే, తుల్జా పంటలను కాపాడుతుంది. శీత్లా పశు సంపదను వృద్ధి చేస్తుంది. మంత్రాల్ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా చేస్తుంది.
శీత్లాభవానీ(దాటుడు) పండుగ
పూర్వం రోజుల్లో తండాల్లో ఆవులే ఆధారంగా వందలాది గిరిజన కుటుంబాలు జీవనం సాగించేవి. నేటికి గిరిజన తండాలో ప్రతి ఇంటిలో ఆవులు, గేదెలు, కోళ్లు, గొర్రెలు, మేకలు తప్పనిసరిగా పెంచుతారు. పశుసంపద దినదినాభివృద్ధి చెందాలని, జీవాలకు ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని మొక్కుతూ గిరిజనులు ఏటా వానకాలం ప్రారంభంలో మంగళవారం రోజున శీత్లాభవానీ(దాటుడు) పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టు కింద ఏడు ప్రతిమలను ప్రతిష్టించి ఇంటికో ఉల్లిగడ్డ, రూపాయి, నవధాన్యాలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూజలు చేసి మేకలు, కోళ్లు బలిచ్చి మేక పేగులపై నుంచి పశువులను దాటిస్తారు. రక్తంతో తడిసిన నవధాన్యాలను పశువులపై చల్లుతారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలనీ గొడ్డూగోదా, పిల్లాజెల్లా సల్లంగా ఉండాలని మొక్కులు సమర్పిస్తారు.
ఇండ్లలో మేరామా, సేవాభాయ్కి విశేష పూజలు
తీజ్లో పాల్గొనే ఇంటి ఆవరణలో మేరామా దేవతతో పాటు సేవాభాయ్ దేవుడికి పూజలు చేస్తారు. ఇంటి ముందు జొన్నలు నింపిన గోనె సంచులు పెట్టి, ఒక చిన్న కడవలో నీళ్లు పోస్తారు. తర్వాత అందులో లింబేర్ పాన్(వేప మండలు) చేసి పెడతారు. ఆ కడవకు మూడు పసుపు, కుంకుమ బొట్టు పెడతారు. ఈ సందర్భంలో వెండితో చేసిన మేరామా విగ్రహాన్ని గానీ, రూపాయి బిల్లను గానీ పెట్టి మేకపోతులను బలిస్తారు. మేరామా పూజ నిర్వహించిన కొద్ది దూరంలో సేవాభాయ్ పూజలు చేస్తారు. ఈ పూజను కడావ్ అంటారు. సేవాభాయ్ శాఖాహారి. అందుకే ఆయనకు శాకాహార పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీర్ఘచతురస్రాకారంలో గొయ్యి తీసి అందులో కట్టేలు పెట్టి మంట వేసి, ఒక పెద్ద గిన్నెలో కడావ్ వండుతారు. కడావ్ సిద్ధమైన తర్వాత బెల్లం, రొట్టెలు కలిసిన సాత్ (ఏడు) చుర్మో ముద్దలను మహిళలు ఒక పళ్లెంలో పెట్టుకుని, పందిరి వేదికగా పెడుతారు. అప్పుడు సేవాభాయ్కి కడావ్ నైవేద్యాన్ని సమర్పిస్తారు. చివరి రోజు సాయంత్రం తీజ్ ఉన్న చోట అన్నదమ్ములంతా తలపాగాలు కట్టుకొని, వరుసగా కూర్చుంటారు. తాము పెంచిన బుట్టల నుంచి గోధుమ నారును తుంచి తాతలు, అన్నదమ్ముల తలపాగాల్లో పెడుతారు. తర్వాత తీజ్ బుట్టలను తీసుకొని, ఆటాపాటలతో ఊరేగింపుగా బయలుదేరుతారు. నీళ్లలో వదిలేందుకు విచార వదనాలతో ఉన్న కన్నె పిల్లల పాదాలను వారి సోదరులు కడిగి, తోచిన విధంగా కానుకలు ఇస్తూ వారిని ఓదారుస్తారు. నిమజ్జనం తర్వాత మళ్లీ తీజ్ వేదిక వద్దకు ఆటాపాటలతో వచ్చి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోతారు. దీంతో తీజ్ పండుగ ముగుస్తుంది.
పండుగ ఎలా ప్రారంభమవుతుందంటే?
తండాలో ఉన్న పెళ్లి కాని యువతులు తండా కేంద్రంగా ఉండే చోట గుమిగూడి చర్చించుకుంటారు. అనంతరం ఈ విషయాన్ని తండా పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో తండాలో చాటింపు చేసి, సమయాన్ని ప్రకటిస్తారు. అమ్మాయిలు అందరూ కలిసి మొదట తండా నాయకుడి ఇంటికి, తర్వాత మిగతా వాళ్ల ఇండ్లకు గోధుమ ధాన్యం సేకరిస్తారు. వాటిని ఇత్తడి బిందెలో నానపెడుతారు. (గతంలో ఇలా చేసేవారు. ఇప్పుడు నాణ్యమైన విత్తనపు గోధుమలు కొనుగోలు చేసి, మొలుకల కోసం వినియోగిస్తున్నారు.) తర్వాత ఎర్రమట్టి , చెరువుమట్టి, పుట్టమట్టి, ఆవు పేడ మొత్తం కలిపి మెత్తగా చేస్తారు. తండా పెద్ద మనిషి ఇంటి వద్ద ఒక డాక్లో(పందిరి) వేస్తారు. తర్వాత ప్రతి ఇంటి నుంచి షిబ్బి తీగతో ఆల్లిన చిన్న బుట్టలలో సగానికి తక్కువగా వేసి ఉన్న మట్టిలో గోధుమ గింజలను వేసి, పందిరిపై పెడతారు. ఈ సందర్భంగా తమ సంప్రదాయాలతో నగారా వాయిస్తారు. ఆటాపాటలు ప్రదర్శిస్తారు.
తొమ్మిది రోజులు తీరొక్క విశేషం
తీజ్ పండుగ మొదటి రోజు నుంచి గోధుమ నారు కలిగిన బుట్టలను చెరువుల్లో నిమజ్జనం చేసే వరకు తీజ్లో తొమ్మిది రోజులు పాటు తీరొక్క విశేషం ఉంటుంది. రోజు ఉపవాసంతో ఉంటూ ఉదయం, సాయంత్రం బావులు, బోర్లు నుంచి బిందెలు, కుండల్లో నీటిని తీసుకవచ్చి గోధుమ నారును పెంచడంతో పాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. గిరిజన దేవతలందరికీ పూజలు చేస్తాం. గోధుమ
నారు పందిరి వద్ద సాయంత్రం ఆధ్యాత్మికతో లంబాడి పాటలు పాడుతాం.
– గుగులోతు రజిత, పెద్దతండా, అక్కన్నపేట
తరతరాల సంప్రదాయం
తరతరాలకు వస్తున్న ఆచార పండుగ తీజ్. కచ్చితంగా తండాల్లో ఏటా తప్పకుండా తీజ్ వేడుకలు నిర్వహిస్తారు. ఒకప్పుడు తండాల్లో జరిగే తీజ్ వేడుకలు నేడు తండాలతో పాటు పట్టణాలు, నగరాల్లో కూడా గిరిజనులు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఎక్కడున్న ఏ స్థాయికి వెళ్లిన గిరిజనులు ఆచార వ్యవహరాలకు సంబంధించిన పండుగ కావడంతో తప్పకుండా తీజ్ వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యంగా పెండ్లికాని యువతులు(ఆడపిల్లలు) ఈ పండుగలో కీలకం. తీజ్ పండుగ అంటే బతుకమ్మ పండుగతో సమానం.
– బుటాలే సుజాత, సంగారెడ్డి
తండా పెద్దమనిషి ఇంటికాడ వేడుకలు
గిరిజన తండాల్లోని తండా పెద్దమనిషి లేదా గిరిజన పూజరి ఇంటి వద్ద తీజ్ వేడుకలను జరుపుతాం. ఆషాఢంలో శీత్లా పండుగ, శ్రావణమాసంలో తీజ్ పండుగ చేసుకుంటాం. తండాల్లో పేద, ధనిక తేడా లేకుండా అందరం కలిసి, మెలిసి జరుపుకొనే పెద్ద పండుగ. తండాల్లో జరిగే తీజ్ వేడుకలకు గిరిజన కులస్తులందరూ తప్పకుండా వస్తారు. గిరిజన యువతులందరికి ఇష్టమైన పండుగను నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తారు.తాతముతాత్తల నుంచి ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ.
– మోహన్ నాయక్, మెదక్
తొమ్మిది రోజులు పూజలు..
ఏటా వేడుకలను నిర్వహిస్తాం. పెండ్లి కాని యువతులు తొమ్మిది రోజుల పాటు నిష్టగా పూజల్లో పాల్గొంటారు. పిల్లల పెండ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించి వారు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వేడుకలు ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. చివరి రోజు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి నిమజ్జనం చేసి వేడుకలు ముగిస్తారు.
– రాథోడ్ మౌనిక, సంగారెడ్డి