పటాన్చెరు, జూలై 7: కోడి పందెంలో పాల్గొన్న 21 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పటాన్చెరు శివారులోని చిన్న కంజర్లలో గల మామిడి తోటలో కోడి పందేల స్థారవంపై బుధవారం పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నాడు. 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కోడి పందెంలో పాల్గొన్న 21 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. ప్రధాన నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌గా గుర్తించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న ప్రభాకర్‌ను త్వరలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. కోడి పందెంలో పాల్గొన్న వ్యక్తుల నుంచి లభ్యమైన డబ్బుతో పాటు సెల్ఫోన్లు, 31 కోళ్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిర్వాహకులు అక్కినేని సతీశ్, బర్ల శ్రీనివాస్‌లతో పాటు మరో 19 మంది జూదంలో పాల్గొన్నారన్నారు. సమావేశంలో డీఎస్పీతో పాటు పటాన్చెరు సీఐ వేనుగోపాల్రెడ్డి ఉన్నారు.