సిద్దిపేట, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు నూతన సాగు విధానాలతో అధిక దిగుబడి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వం సైతం సబ్సిడీతో రైతులను ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు పత్తి సాగు వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వారం నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు వానకాలం సాగుకు సంబంధించి పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఆదిశగా రైతులను సమాయత్తం చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసిన రైతు వేదికల్లో రైతులకు విస్తృతంగా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.ఈ యేడాది పత్తి ఎక్కువగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల అధిక దిగుబడితో పాటు ఎక్కువగా లాభాలు ఉన్నాయి.
సాధారణ పద్ధతికి అధిక సాంద్రత పద్ధతికి దిగుబడిలో వ్యత్యాసం ఉంది. అధిక సాంద్రత పద్ధతి ద్వారా సాగు చేస్తే ఎకరాకు మొక్కల సంఖ్య 25 వేలకు పైగా ఉండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. అంతే కాకుండా ఒకేసారి పత్తిని తీయవచ్చు (ఏరవచ్చు). సాధారణ పద్ధతిలో మూడు నాలుగు సార్లు పత్తిని తీయాల్సి వస్తుంది. జిల్లాలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులకు రూ 4 వేల సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు రైతు బంధు ఒకటి రెండు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నది. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకోవచ్చు. గత వారం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పత్తి సాగు చేసే పనులు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాల్లో రైతులు పత్తి పంట ఎక్కువగా సాగు చేయటానికి మొగ్గు చూపుతున్నారు. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి రికార్డు స్థాయిలో సాగుకానున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 6,16,908 ఎకరాల సాగే లక్ష్యం
సీఎం కేసీఆర్ రైతులకు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తుండడంతో సంతోషంగా వానకాలం సాగుపనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి తర్వాత పత్తి పంట అధికంగా సాగు చేస్తారు. సాగుతో రైతులకు మంచి లాభాలు ఉండడంతో ఈ పంటపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పత్తి పంటను ప్రోత్సహిస్తుంది. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచి సాగులో తోడ్పాటు అందిస్తున్నది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తిపంటను రైతులు రికార్డు స్థాయలో సాగు చేయనున్నారు.ఇక్కడ మంచి నేలలు ఉండడంతో పాటు ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ సారి అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగుచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పత్తి పంట సాగు లక్ష్యం 2 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో సాగు లక్ష్యం 94 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో3 లక్షల 22 వేల 908 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకున్నది. ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు రైతులకు దన్నుగా ప్రభుత్వం నిలుస్తున్నది. డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం వల్ల రైతులు మంచి లాభాలు పొందుతారు.
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుకు సై..
అధిక సాంద్రత విధానంలో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధిక సాంద్రత పత్తి సాగు చేసే రైతులకు ప్రోత్సాహంగా రూ. 4 వేలు పెట్టుబడుల ఖర్చు కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు దూది పూల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పత్తిసాగు విధానం వల్ల రైతులకు అధిక దిగుబడి రానున్నది. సాధారణ పద్ధతిలో రైతులు పత్తి సాగు చేసినప్పుడు ఎకరాకు ఎనిమిది వేలకు పైగా మొక్కలు వస్తాయి. సాలు పత్తి, డబ్బా పత్తి ఆకారంలో విత్తనాలు పెడతారు. పత్తి కోతకు వచ్చే సమయంలో మూడు నుంచి నాలుగు సార్లు పత్తిని రైతులు ఏరుతారు. అధిక సాంద్రత పత్తి వల్ల ఎక్కువ విత్తనాలు పడతాయి. ఎక్కువ మొక్కలు ఉంటాయి. ఎకరానికి సరాసరి 25 వేలకు పైగా మొక్కలు ఉంటాయి. పెట్టుబడుల ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది.సాధారణ పద్ధతిలో మొక్కల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు, అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే మొక్కల మధ్యన దూరం 20 సెంటీ మీటర్లు ఉండగా సాళ్ల మధ్య దూరం 80 సెంటీమీటర్లు ఉంటుంది.
సాధారణ పద్ధతిలో నైతే ఎకరానికి పత్తి ప్యాకెట్లు రెండు లేదా రెండున్నర వరకు పడతాయి. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి ఐదు నుంచి ఆరు మధ్యన పడతాయి. దీంతో పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. సాధారణ పద్ధతికి , అధిక సాంద్రత పద్ధతికి పోల్చుకుంటే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. సుమారు ఎకరాకు ఎంత లేదన్నా 15 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రానున్నది. అదే సాధారణ పద్ధతి అయితే ఎకరాకు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక సాంద్రత సాగు పద్ధతిలో నైతే ఒకే సారి పత్తికోతకు వస్తుంది. దీంతో ఒకే సారి పంటను తీసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో నైతే మూడు నుంచి నాలుగు సార్లు కోతకు వస్తుంది. దీని వల్ల కూలీల భారం కూడా అధికంగా పడుతుంది. ప్రస్తుత సమయంలో రైతులు సాధారణ పద్ధతిలో కాకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయ పరిశోధకులు, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులను అధిక సాగు పద్ధతిలో పత్తి సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
సాగు పద్ధతి
త్వరగా కాపుకు వచ్చి ఒకే సారి పత్తి పగిలే రకాలను ఎంచుకోవడం లాంటి పని రైతులు చేయాలి. మొక్కలను దగ్గరగా ( ఎకరానికి సుమారు 25 వేల మొక్కలు వరకు) నాటాలి. మొక్కలకు గాలి వెలుతురు బాగా తగిలేందుకు మొక్కల ఎత్తును తగ్గించడానికి మందులను పిచికారీ చేయాలి. సాధారణంగా పెరుగుదలను నియంత్రించడానికి మెపిక్యాట్ క్లోరైడ్ 5 శాతం మందును వాడతారు. దీనిని 45,65 రోజుల పైరుకు వరుసగా 200 మి.లీ చొప్పున ఎకరాకు పిచికారీ చేయాలి. పైరు పెరుగుదలను బట్టి వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూనే 85 రోజులకు అవసరాన్ని బట్టి ఈ మందును పిచికారీ చేయాల్సి ఉంటుంది. పత్తి పైరు నాటిన 95 రోజులప్పుడు తల తుంచినైట్లెతే కాపుతో పాటు కాయ పరిమాణం పెరుగుతుంది.