న్యాల్కల్, ఏప్రిల్ 18: స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో నేడు అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. సంవత్సరం పొడువున ప్రతినెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజుల్లో దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, మంగళవారం రోజున వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి రోజున దర్శించుకుంటే అంత పుణ్యఫలం వస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనాకి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ భరత్‌కుమార్, హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చే వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్, తాగునీరు, వసతి, అన్నదానం తదితర సౌకర్యాలను కూడా ఏర్పాట్లు చేశారు.
అర్ధరాత్రి నుంచే ప్రత్యేక పూజలు
అంగారక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామివారికి ఆభిషేకం, గణపతి హవనం, కల్యాణం, హారతి తదితర ప్రత్యేక పూజలను చేపట్టనున్నామని ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్, బీదర్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
హాజరుకానున్న మంత్రి హరీశ్‌రావు
సిద్ధివినాయక స్వామి దర్శనానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ హనుమంతరావు హాజరుకానున్నారని ఆలయ కమిటీ అ ల్లాడి నర్సింహులు తెలిపారు.