స్వరాష్ట్రం సిద్ధించక ముందు వానకాలం వచ్చిందంటే రైతులకు భయం పట్టుకునేది. వరద వస్తున్నదంటే గుండె దడదడలాడేది. చెరువు కట్టకు గండిపడి ఎక్కడ పంటలు మునుగుతాయోనని వారికి కంటిమీద కునుకు లేకుండా పోయేది. నాలుగు రోజులు సాధారణ వర్షాలు కురిస్తే, కట్టలకు గండ్లు పడి ఎకరాల్లో పంటలు నీటమునిగి అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చేవి. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. తెలంగాణ సర్కారు ‘మిషన్ కాకతీయ’తో చెరువులను పునరుద్ధరించింది. దీంతో తటాకాలు పటిష్టంగా మారాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాగులు, వంకల్లో వరద ఉరకలెత్తింది. చెరువుల్లోకి వరద భారీగా వచ్చింది. కానీ, జిల్లాలో ఏ ఒక్క చెరువు కట ్టకూడా తెగిపోలేదు. ఒకప్పుడు ఏ చెరువు చూసినా బుంగలు పడేది, నేడు ఆ పరిస్థితే లేదు. మత్తళ్లు, డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వలు ధ్వంసం కాలేదు. అలుగుపారితే తప్పా తటాకాల నుంచి చుక్కనీరు బయటకు పోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం రైతులకు మేలు చేస్తున్నది.
సిద్దిపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య పాలనలో చిన్న పాటి వర్షాలు కురిశాయంటే చాలు చెరువులకు గండ్లుపడి నీళ్లన్నీ వృథాగా వెళ్లేవి..! నాడు చెరువుల స్థితిగతులను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు..! కట్టలు తెగిన, గండ్లుపడిన చెరువులు..! ఆ చెరువుల్లో లొట్టపీసు చెట్లు, సర్కారు తుమ్మ చెట్లు కనిపించేవి..! వందల ఏండ్ల చరిత్ర కలిగిన చెరువులు సమైక్య రాష్ట్రంలో ఆదరణ లేక ఆనవాళ్లు కోల్పోయాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడంతో ప్రతి చెరువుకు పూర్వవైభవం తీసుకొచ్చారు. ‘మిషన్ కాకతీయ’ పథకంతో ఏటా 20శాతం చొప్పున చెరువుల పునరుద్ధరణ చేపట్టి, గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోశారు. సిద్దిపేట జిల్లాలో 3,426 చెరువులున్నాయి. వారం పది రోజులుగా కురిసిన వర్షాలకు తోడుగా గత ఎండాకాలంలో నింపిన కాళేశ్వరం జలాలు తోడు కావడంతో పలు చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. అయినా ఏ ఒక్క చెరువుకు గండిపడిన సంఘటనలు చోటుచేసుకోలేవు. రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా ప్రతి చెరువు కట్ట, మత్తడి, తూము పనులను పటిష్టం చేసింది. నియోజకవర్గ కేంద్రాల్లో మినీ ట్యాంకుబండ్లు, ప్రతి పల్లె ఊర చెరువుకు బతుకమ్మ మెట్లను నిర్మించింది. ‘మిషన్ కాకతీయ’ పథకంతో చెరువు కట్టలను పటిష్టం చేయడంతో ఇవాళ ఏ ఒక్క చెరువు కట్ట తెగలేదు.. ఏ ఒక్క చెరువు గండి పడిన దాఖలాలు లేపు. రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ‘మిషన్ కాకతీయ’ పనులు చేట్టడంతో ప్రతి చెరువు పటిష్టంగా ఉంది. ఎన్ని నీళ్లు వచ్చినా తటాకాలు తట్టుకుంటున్నాయి. చెరువు మట్టి తీయడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. చెరువు కింద ఆయకట్టు సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్‌కాకతీయ కల సాకరమైంది. చెరువుల పునరుద్ధరణతో చెరువు కట్టలు గ్రామాలకు వారధులు అయ్యాయి. ఇక వాగులు, చిన్న కాల్వలపై బ్రిడ్జిలు నిర్మించడంతో రవాణాకు ఇబ్బందులు కలగడం లేదు. ప్రతీ పల్లెకు రహదారులు నిర్మించడంతో ప్రజలకు రవాణా సాఫీగా సాగుతున్నది.
సిద్దిపేట జిల్లాలో 3,426 చెరువులు
రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడంతో ఇవాళ చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. ఏ ఊరికెళ్లినా చెరువులు నిండుగా కనబడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మించారు. అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా రెండేండ్ల నుంచి ఎండకాలంలోనూ చెరువులు, వాగులను గోదావరి జలాలతో నింపారు. జిల్లాలో 3426 చెరువులతో పాటు కూడవెల్లి, హల్దీవాగు, మోయతుమ్మెద, సిద్దిపేట వాగులు ఉన్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం జిల్లాలో 226 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. మరో 2114 చెరువుల్లో 50శాతం మేర నీళ్లు చేరాయి. పలు చెక్‌డ్యామ్‌లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతి చెరువును పటిష్టం చేయడంతో ఇవాళ ఆ చెరువులు ఊరికి ఆదెరువయ్యాయి. చెరువు బాగుంటే ఊరంతా బాగుంటుంది. చెరువు నిండింతేనే ఊరంతా ఉపాధి దొరుకుతుంది. స్వరాష్ట్రంలో చెరువుల అందాలే మారిపోయాయి. ప్రతి చెరువు పటిష్టంగా ఉండి మత్తళ్లు పోస్తున్నాయి. పల్లె జనం చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎంత పెద్ద వర్షాలు వచ్చినా పటిష్టంగా ఉన్నాయి. ఆయా జిల్లాలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టేలా విరివిగా చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. చెరువు మట్టిని రైతుల పొలాల్లో వేసుకొని, భూసారాన్ని పెంచుకున్నారు. చెరువు కింద ఉన్న బావులు, బోర్లలో భూగర్భజలాలు ఘననీయంగా పెరిగాయి. రైతులు తమ పంటలను పండించుకున్నారు. చెరువు పునరుద్ధరణతో గ్రామంలోని కులవృత్తులకు జీవనోపాధి దొరుకుతున్నది. మిషన్ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయి.
భారీ వర్షాలు కురిస్తే పల్లెల్లో చెరువులు, కుంటలకు భారీగా గండ్లు పడేవి. మరమ్మతులు చేయకపోవడంతో నీరు వృథాగా పోయేది. గత పాలకులు కనీసం వాటిని పట్టించుకోకపోవడంతో రైతులే చెరువులకు మరమ్మతులు చేసుకునేవారు. కొన్ని సందర్భాల్లో చెరువులకు గండ్లు పడి, తూములు తెగిపోయి కింద ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరడంతో పంట నష్టం జరిగేది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ ఫలితాన్నిస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించడంతో చుక్క నీరు కూడా వృథా కావడంలేదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ఇప్పుడు ఫలాలు ఇస్తున్నది. ఈ పథకంలో గ్రామాల్లోని చెరవులకు మరమ్మతులు చేపట్టారు. పూడికలు తీశారు. చెరువుల గట్టు వెంట ఈత, ఇతర మొక్కలు నాటించారు. దీంతో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. కరకట్టలు మొక్కలతో పచ్చందాలతో ఆహ్లాదాన్నిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో 3140 చెరువులు
సంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయలో రూ.700 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేశారు. దీంతో జిల్లాలోని 3140 చెరువులు, కుంటల్లో పనులు చేపట్టిన, వాటిని పటిష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండి నీటితో కళకళలాడుతున్నాయి. పనులు నాణ్యతాగా చేపట్టడంతో భారీ వర్షాలు కురిసినా గండ్లు పడడంలేదు. సాధారణ వర్షపాతం జూలైలో 8.21 సెం.మీటర్లు, భారీ వర్షాలతో 26.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో 200 చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. 248 చెరువులు నీటితో పూర్తిగా నిండాయి. 911 చెరువులు 75 శాతం నిండాయి. 1263 చెరువులు 50 శాతం మేర నిండాయి. మరో 518 చెరువుల్లోకి 25 శాతం వర్షం నీరు వచ్చింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులను పటిష్టం చేయడంతో భారీ వర్షాలు కురిసినా చెరువులకు గండి పడలేదని ఇరిగేషన్ ఎస్ఈ మురళీధర్ తెలిపారు.
వంతెనలు, కల్వర్టుల నిర్మాణం
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 నుంచి 2022 వరకు జిల్లాలో రూ.102 కోట్లతో 49 వంతెనలు నిర్మించింది. ఆర్అండ్బీ ద్వారా రూ.101కోట్లతో 46 వంతెనలు నిర్మించింది. భారీ వర్షాలు కురిసి వాగులు పొంగినా వంతెనలు ఉండడంతో ప్రజలు సాఫీగా ప్రయాణిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా ఎక్కడా రాకపోకలు నిలిచిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన వంతెనలు గ్రామాలకు రాకపోకలు సులభతరం చేసిందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాడు యాతన.. నేడు సాఫీగా
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు సంగారెడ్డి జిల్లాలో రహదారులు, వంతెనల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఇందుకు సంగెం గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుత సిర్గాపూర్ మండంలోని సిర్గాపూర్- సంగెం గ్రామాల మధ్య ఊర వాగు ప్రవహిస్తున్నది. భారీ వర్షాలు కురిస్తే ఈ వాగు పొంగిపొర్లేది. వాగు పొంగితే సంగెం గ్రామస్తుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. ఉమ్మడి రాష్ట్రంలో ఊరవాగుపై బ్రిడ్జి నిర్మించి తమ కష్టాలు తొలగించాలని సంగెం గ్రామస్తులు ఏళ్ల తరబడి వేడుకున్నా ఫలితం లేకపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు గుర్తించి రూ.2.20 కోట్లతో ఊరవాగుపై బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం వాగు పొంగిపొర్లుతున్నా సంగెం గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. సిర్గాపూర్‌తోపాటు ఇతర గ్రామాలకు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు.
రూ.50 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం
మెదక్ జిల్లాలో రూ.50 కోట్లతో బ్రిడ్జిలను నిర్మించారు. భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలతో పాటు ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులపై బ్రిడ్జిలు నిర్మించడంతో గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.20 కోట్లతో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లలో బ్రిడ్జిలు నిర్మించారు. మెదక్ మండలం బాలానగర్ వద్ద పీఎంజీఎస్‌వై కింద రూ.1.02 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. వెల్దుర్తి మండలం శెట్పల్లి గ్రామ శివారులో పీఏజీవైఎస్ కింద రూ.1.07 కోట్లతో అత్యాధునికంగా బ్రిడ్జి, హవేళీఘనపూర్ మండలం అనంతసాగర్, తిమ్మాయిపల్లి గ్రామాల మధ్యలో నాబార్డు నిధులు రూ.75 లక్షలతో బ్రిడ్జి, రాజ్పేట్, కొత్తపల్లి గ్రామాల మధ్య గంగమ్మ వద్ద రూ.5.50 కోట్ల నాబార్డు నిధులతో అతి పెద్ద బ్రిడ్జిని నిర్మించారు. మెదక్ మండలం ర్యాలమడుగు వద్ద నాబార్డు నిధులతో రూ.50 లక్షలతో బ్రిడ్జి, రామాయంపేట మండలం రాంపూర్, చల్మెడ శివారుల సమీపంలో పీఎంజీఎస్‌వై కింద రూ.1.40 కోట్లతో బ్రిడ్జి, నస్కల్ వద్ద పీఎంజీఎస్‌వై కింద రూ.కోటి 20 లక్షలతో బ్రిడ్జిని నిర్మించారు. తూప్రాన్‌లో నాబార్డు నిధుల కింద రూ.7 కోట్లతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అది చివరి దశలో ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి నుంచి ఖాజీపేట వరకు రూ.50 లక్షలతో వంతెన, వెల్దుర్తి మండలంలో ఎం.జలాల్పూర్ నుంచి ధర్మారం వరకు రూ.2.70 కోట్లు, మూసాపేట నుంచి దౌల్తాబాద్ వరకు నాబార్డు నిధులతో రూ.50 లక్షలతో బ్రిడ్జిలు నిర్మించారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో సుమారు రూ.33 కోట్ల వ్యయంతో ఆర్డీఎఫ్ కింద రెండు బ్రిడ్జిలు, నాబార్డు కింద ఒక బ్రిడ్జి, ఎఫ్డీఆర్ కింద రెండు బ్రిడ్జిలు, 131 సీఆర్ఎన్ కింద మూడు బ్రిడ్జిలు, 131 కింద 10 బ్రిడ్జిలు నిర్మించారు. దీంతో భారీ వర్షాలు కురిసినా రాకపోకలతో పాటు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు.