చిన్నశంకరంపేట, డిసెంబర్10: కారు రోడ్డు కిందికి దూసుకెళ్లడంతో వెనుక డోర్ ఊడిపోయి, ఒకరు కిందపడి మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైన ఘటన చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్.కొండాపూర్ గ్రామ శివారులో చేగుంట, మెదక్ ప్రధాన రహదారిపై ఏడిప్పల్ వద్ద శనివారం జరిగింది. ఎస్సై సుభాశ్గౌడ్ కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కమలాపురం కృష్ణతో పాటు అతడి తల్లి నర్సమ్మ(45), భార్య సౌందర్య, కూతురు శ్రీనిత్యతో కలసి చేగుంట మీదుగా మెదక్ వైపు వెళ్తున్నాడు.
చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ గ్రామ శివారులోని ఏడుప్పల్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు వెనుక డోర్ ఊడిపోయింది. అక్కడే కూర్చున్న నరసమ్మ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురికి గాయాలయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న చిన్నశంకరంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మెదక్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అదే దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాశ్గౌడ్ తెలిపారు.