మహాశివరాత్రికి ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ‘హరోం హరం.. జయజయ శంకర.. శివశివ శంకర’.. నామస్మరణలు మార్మోగనున్నాయి. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న, పొట్లపల్లి స్వయంభూ, దుబ్బాక బుగ్గ రాజేశ్వర, సంగారెడ్డి జిల్లాలోని కేతకీ సంగమేశ్వర, మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆయా ఆలయాల పాలక వర్గాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. మంగళవారం ఏడుపాయల జాతరను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి, ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మొదటిరోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్నరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకోనున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 28: మాఘమాసం బహుళ చతుర్దశి ఆరుద్ర జన్మ నక్షత్రంలో మహాశివుడు పుట్టగా, యేటా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఏడాదిలో అన్ని దినాల్లో దేవాలయాల్లో పగటి పూటనే పూజలు నిర్వహిస్తారు. వీటికి సమయపాలన కూడా పాటిస్తారు. అయితే, శివరాత్రి రోజున మాత్రం వేకువజాము నుంచి మరుసటిరోజు వేకువజాము వరకు రాత్రంతా పూజలు జరుపుతారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేస్తారు. మరుసటి రోజు ఉదయం అల్పాహారం తీసుకుంటారు. జాగరణ సమయంలో శివ పురాణ పారాయణం, అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. శివ అనే పదానికి మంగళం, క్షేమం, శుభం, శ్రేయం అనే అర్థాలు ఉన్నాయి.
శివరాత్రి ఔన్నత్యం
పార్వతీదేవి కోరిక మేరకు శివరాత్రి ఔన్నత్యాన్ని శివుడు వివరించినట్లు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఉపవాస వ్రతాన్ని తెలిసి గానీ, తెలియక గానీ ఆచరించినా, విన్నా, చూసినా యముడి నుంచి విముక్తి పొందుతారని, పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వ్రతాన్ని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున చేస్తేనే పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కొప్పోల్‌లో ప్రారంభమైన ఉత్సవాలు
మండల పరిధిలోని కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేద బ్రాహ్మణ పండితులు ఉమా సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు స్వామివారి ఎదుట ఆలయంలో అఖండ దీపారాధన వెలిగించారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తహసీల్దార్ చరణ్‌సింగ్, పేట ఎస్సై బాల్‌రాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తి శ్రద్ధలతో పూజించాలి
మహాశివరాత్రి పర్వదినాన శివలింగంపై రాగి చెంబుతో నీళ్లు పోసి.. చిటికెడు భస్మం, మారేడు ఆకులతో అలంకరించాలి. తుమ్మి పుష్పాలతో శివార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. త్రికరణ శుద్ధితో మనోవాక్కాయ కర్మలను ఏకోన్ముఖణం చేసి మహాదేవుడిపైకి మరల్చడమే నిజమైన శివారాధన. అదే పాప విముక్తికి మార్గం.
– కృష్ణమూర్తి, సిద్ధాంతి, మెదక్