మెదక్ రూరల్, ఫిబ్రవరి 28 : దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా మెదక్ మండలంలోని కొంటూర్ గ్రామంలో ‘దళితబంధు’పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కొంటూర్ గ్రామంలో 20 మందిని ఎంపిక చేసినట్లు ఆమె చెప్పారు. 20 మంది ఎలాంటి యూనిట్లు ఎంపిక చేసుకుంటున్నారని అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకుంటే వ్యవసాయశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు ఆటో, డీసీఎం ఇతర వాహనాలు కొనుగోలు చేస్తే వెంటనే లైసెన్స్‌లు జారీ చేయాలని ఆర్టీవో అధికారులను ఆదేశించారు. దళితబంధు కింద రూ.10 లక్షలతో ఒక్కో కుటుంబంలో మూడు నుంచి నాలుగు యూనిట్లు ఏర్పా టు చేసుకోవచ్చన్నారు. ఫొటో స్టూడియో షాపును మెదక్ జిల్లాలో కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చన్నారు. లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ఒకే రకమైన యూనిట్ కాకుండా వారు చేసే వృత్తిని బట్టి ఎంచుకోవాలన్నారు.
ట్రాక్టర్, మినీ డైయిరీ, సూపర్ మార్కెట్, మినీ డీసీఎంలు, బోర్లు, ఫొటో స్టూడియోలు వివిధ రకాల యూనిట్లలో ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. లబ్ధిదారులు ఎం చుకున్న యూనిట్లను నెల రోజుల్లో ప్రారంభించాలన్నారు. నెలరోజుల్లో యూనిట్లు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యారెడ్డి, ట్రైనీ కలెక్టర్ అశ్వినీవాఖండే, ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, వ్యవసాయ ఏడీ విజయనిర్మల, జిల్లా పశుసంవర్థక అధికారి విజయభాస్కర్‌రెడ్డి, ఆర్డీవో సాయిరాం, ఎంపీడీవో శ్రీరాములు, సర్పంచ్ రాజ్యలక్ష్మీరవీందర్, ఎంపీటీసీ ప్రభాకర్, ఎంపీవో మౌనిక, వ్యవసాయాధికారి శ్రీనివాస్, నాయకులు జయరాంరెడ్డి, కిష్టయ్య, రవీందర్, వెంకట్, ఎలక్షన్‌రెడ్డి, నాగారాజు, దళితబంధు లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.