గతంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఆర్.ఇటిక్యాల గ్రామం, నేడు అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. లక్షలాది రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. విరివిగా మొక్కల పెంపకంతో గ్రామంలో పచ్చదనం నెలకొంది. తాగునీటి సమస్య ఊసే లేదు. అపరిశుభ్రత అనే మాటే లేకుండా పోయింది. కరెంటు ఇబ్బందులు తొలగిపోయాయి. 1529 జనాభా ఉన్న ఈ గ్రామంలో పురుషులు 767 మంది, మహిళలు 762 మంది ఉన్నారు.
నెరవేరుతున్న లక్ష్యం…
గ్రామంలో రూ.40 లక్షలతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, రైతువేదిక నిర్మాణాలు చేపట్టారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పాడుబడిన ఇండ్లను తొలగించారు. ప్రమాదకర గుంతలను పూడ్చారు. నిత్యం మొక్కలకు నీరు పడుతుండడంతో ఏపుగా పెరిగి పచ్చదనం నెలకొంది. నిత్యం మురుగు కాల్వలను శుభ్రం చేస్తుండడంతో సంపూర్ణ పారిశుధ్య గ్రామం ఆర్.ఇటిక్యాల తయారైంది. మిషన్ భగీరథ కింద ట్యాంకుల నిర్మాణంతో తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. రూ.17.50 లక్షలతో మురుగు కాల్వలను నిర్మించడంతో ఆయా వీధుల్లో అపరిశుభ్రం దూరమైంది. బాలవికాస కేంద్రం ద్వారా వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధినీరు అందిస్తున్నారు. రూ.8.5 లక్షలతో హైమాస్ట్ లైట్లు, రూ.2 లక్షలతో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంతులతో గ్రామం వెలిగిపోతున్నది. రూ.10 లక్షలతో సిమెంట్ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.10 లక్షలతో గ్రామపంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ అందుబాటులోకి రావడంతో చెత్త సేకరణ, మొక్కలకు నీటిని అందించే పనులు సులభతరంగా మారాయి. గ్రామ అభివృద్ధిని చూసి అధికారులు, ప్రజాప్రతినిధులు మెచ్చుకుంటున్నారు. అన్ని పథకాలు, కార్యక్రమాలు గ్రామంలో సజావుగా అమలవుతున్నాయి. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.
జిల్లాలోనే ఆదర్శంగా నిలుపుతాం..
మా గ్రామాన్ని మరింతగా అభివృద్ధి పరచి జిల్లాలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషిచేస్తున్నాం. జీపీ పాలక వర్గంతో పాటు గ్రామస్తుల సహకారంతోనే గ్రామంలో మార్పు తీసుకురాగలిగాం. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేస్తున్నాం. గ్రామంలో పథకాలు, కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తున్నాం.
సహకారంతో సమస్యలు దూరం..
అన్ని విషయాల్లో గ్రామస్తుల సహకారం బాగుంది. పన్నుల వసూలుకు గ్రామస్తులు సహక్రిస్తున్నారు. ప్రభుత్వ సూచలనకు అనుగుణంగా గ్రామపరిపాలన సజావుగా కొనసాగుతున్నది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేశాం. పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపడుతున్నాం.