మెదక్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులు 53 అందాయని, వచ్చిన అర్జీలను పరిశీలించి, పెండింగ్‌లో లేకుండా సమస్యలను సకాలంలో పరిషరించాలని ఆదేశించారు. గృహలక్ష్మికి 4, దళితబంధు 8, ఉపాధి అవకాశాలకు 6, ధరణి 28, ఇతర విజ్ఞప్తులు 8 అందినట్లు తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిషరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టరేట్లో క్యాంటీన్ ప్రారంభం
ఉద్యోగులు, ప్రజల కోసం కలెక్టరేట్ మొదటి అంతస్తులో జిల్లా మహిళా సమాక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను కలెక్టర్ రాజర్షి షా , అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. నాణ్యతతో పాటు శుచీశుభ్రత పాటించాలని క్యాంటీన్ యాజమాన్యానికి సూ చించారు. కార్యాలయ గదుల్లో భోజనం చేయకుండా, లంచ్ రూమ్‌లను ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, సీపీవో కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 11: సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్ నిర్వహించే ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వివరాలను అప్డేట్ చేయాలన్నారు. డీఆర్వో నగేశ్ పాల్గొన్నారు.