మెదక్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగా ణ):ఇంటర్మీడియెట్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సంబంధిత అధికారులు పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ అధికారి మాధవి ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ను కళాశాల వారీగా విభజించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ఇంటర్మీడియెట్ విద్యా బోధనలో సమూల మార్పులు అవసరమన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వం అన్ని వసతులు మెరుగుపరుస్తుందని, దానికి అనుగుణంగా లక్ష్యాలను సాధించడంలో నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇంటర్మీడియెట్ పాస్ పర్సంటేజీ పెరగాలంటే డ్రాప్ అవుట్స్ నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రతి విద్యార్థి హాజరు శాతాన్ని గమనించాలని సూచించారు. గత సంవత్సరం సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత అయిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం లక్ష్యాల మేరకు ఆశాతం పెంపుదిశగా కృషిచేయాలన్నారు. బోధన నైపుణ్యాలు మెరుగుపడాలని, విద్యార్థులతో మమేకమై గుణాత్మక విద్యను అందించాలని చెప్పారు. ఇంటర్మీడియెట్ పూర్తైన వెంటనే బాల్య వివాహాలు చేయడానికి విద్యార్థిని తల్లిదండ్రులు పూనుకుంటారని,వాటిని అరికట్టాలంటే జిల్లా సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షలో సంబంధిత ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.