చేగుంట,మే 28: రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులోని ఎరువులు,విత్తనాల బ్యాగులను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని, పీడీ యాక్టు నమోదు చేయిస్తామన్నారు.
మందులు, విత్తనాలను గడువుతేదీలోపు విక్రయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పోలీస్, వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేయిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో 8115 మెట్రిక్ టన్నుల యూరియా, 745 మెట్రిక్ టన్నుల డీఏపీ,2738 మెట్రిక్ టన్నుల పొటాష్, 450 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 280 మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్ఫేట్ అందుబాటులో ఉందన్నారు.
ప్రాథమిక సహకార సంఘాలు,ఆగ్రో రైతు సేవా కేంద్రా లు, డీసీఎంఎస్తో పాటు ప్రైవేట్ దుకాణాల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు నుంచి ఆధార్ వివరాలు సేకరించి పీవోఎస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయించాలని షాపు యజమానులకు సూచించారు. కార్యక్రమంలో చేగుంట వ్యవసాయాధికారి హరిప్రసాద్ పాల్గొన్నారు.