Collector Rahul Raj | రామాయంపేట, ఆగస్ట్ 06 : జిల్లా వ్యాప్తంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఆదివారం తన సతీమణితో మెదక్ జిల్లా కేంద్రం నుండి 20 కిలోమీటర్ల మేర సైకిల్‌పై రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు చేరుకుని అక్కడి పరిస్థితులపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను, రోగులకు అందించే మందులను తనిఖీ చేశారు.
అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ కేసులు అసలే లేవన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఆకస్మిక తనిఖీల ఉద్దేశ్యమన్నారు. పేద ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని తెలిపారు. రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ వైద్యులు ఎక్కువ శాతం నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. డెలివరీలు ప్రభుత్వ దవాఖానాలోనే అయ్యేట్లు సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టిందన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. సెలవు రోజుల్లో కూడా వైద్యధికారులు పనిచేస్తున్నారని అన్నారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించి ప్రతిరోజు ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజలు సైతం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు మనదరికి చేరవన్నారు. తమ ఇంటి ఆవరణలో చెత్తా చెదారం లేకుండా ఉండడమే గాకుండా దోమలు వృద్ది చెందకుండా కుళాయిలలో నీటినిల్వలు ఉండకుండా చూసుకున్నైటెతే ప్రజలందరు సురక్షితంగా ఉంటారన్నారు. దవాఖానాలో వైద్య సిబ్బందిని త్వరలోనే సమకూరుస్తామని అన్నారు. తొందర్లోనే గైనకాలజిస్టు పోస్టును భర్తీ చేస్తామన్నారు. దవాఖానాలో అన్ని రకాల మౌళిక సదుపాయాలను కల్పించడమే గాకుండా నిష్టాతులైన వైద్య సిబ్బందినే నియమిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట దవాఖాన వైద్య సిబ్బంది ఉన్నారు.