రేగోడ్, జూలై 8: ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని లింగంపల్లి, సిందోల్, తాటిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు, నిర్మాణాల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా ప్రభుత్వం నగదు జమచేస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామ పరిసరాలు, ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ బోధన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, బడికి వెళ్లే పిల్లల హాజరు శాతం పెరగాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తారెడ్డి ఉన్నారు.