మెదక్ మున్సిపాలిటీ, జూన్ 15 : భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది. యేసయ్య నామస్మరణలతో చర్చిపరిసరాలు హోరెత్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులనుద్దేశించి చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జి రెవరెండ్ శాంతయ్య దైవ సందేశం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం ఫాస్టర్లు భక్తులను ఆశ్వీరదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సువణ్ డగ్లస్, సంశాన్ సందీప్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.