మెదక్, డిసెంబర్ 17 : వానకాలం పంటను 15 రోజుల ముందే రైతుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రథమంగా నిలిచామని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. జిల్లాలో నేటితో కొనుగోలు కేంద్రాలు మూసి వేస్తున్న సందర్భంగా శుక్రవారం జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌తో కలిసి అధికారులతో మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా 378 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 74,902 రైతుల నుంచి రూ.758.19 కోట్ల విలువ గల 38,68,338 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 57,173 రైతుల ఖాతాల్లో రూ.547 కోట్ల డబ్బులు వేశామన్నారు. మిగతా 17.729 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.211 కోట్లను ట్యాబ్ ఎంట్రీ, మిల్లరు అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన వెంటనే వేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 90 శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈసారి రైతులకు ముందస్తుగా ఓటీపీపై అవగాహన కలిగించి ఎన్రోల్మెంట్ చేయడం ద్వారా డబ్బుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు. నెలన్నరలోగా పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అదనపు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, పంట మార్పిడితో మేలు జరుగుతుందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పనిముట్లు గురించి తెలుసుకుంటూ పంటలు సాగు చేయాలని సూచించారు. ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవాలని, పంటల దిగుబడిపై వ్యవసాయం అధికారులు సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.