రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణరావుపేటలోని పెద్దచెరువు, గుర్రాలగోంది గ్రామంలోని పెద్దరాయిని చెరువు, మాటిండ్ల గ్రామంలోని నక్కవాగు చెక్‌డ్యామ్, మల్యాల గ్రామంలోని తాళ్లచెరువు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల నీటి వనరులకు జలకళ వచ్చింది.
– నారాయణరావుపేట, సెప్టెంబర్ 12
ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో మెదక్, సంగారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు, కుంటలు, పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతుండగా, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మత్తడి దూకుతూ దిగువకు జోరుగా ప్రవహిస్తోంది. దీంతో నల్లవాగు జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం 1493.50 అడుగులకు చేరిందని సంబంధిత ఏఈ సూర్యకాంత్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. రెండు గేట్లు ఎత్తివేయగా, 21791 క్యూసెక్యుల నీరు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. మెదక్‌జిల్లా ఉప్పులింగాపూర్ గ్రామాల శివారులోని హల్దీ వాగుపై ఉన్న చెక్‌డ్యాంలతో పాటు వెల్దుర్తి దేవతల చెరువు వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేపల వేటకు తరలివస్తున్నారు.