మద్దూరు, జూన్ 7: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లి-ఉప్పరోనిగడ్డల మధ్యగల మట్టి రోడ్డు అధ్వానంగా మారిం ది. చిన్నపాటి వర్షం పడితేనే ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారుతున్నది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డుపై ప్రయాణిస్తున్నారు.
సిద్దిపేట-జనగామ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న ఈ రోడ్డుపై నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు మరమ్మతులకు రూ. 5లక్షల నిధులు మంజూరు చేసింది. అదే సమయంలో ప్రభుత్వం మారడంతో రోడ్డు మరమ్మతుల పనులు అటకెక్కాయి. రోడ్డు మరమ్మతులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా దెబ్బతింటున్నది. మట్టి రోడ్డు స్థానంలో బీటీ రోడ్డు నిర్మిస్తే తమ ఇబ్బందులు తొలుగుతాయని వంగపల్లి, ఉప్పరోనిగడ్డ గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నారు.