హుస్నాబాద్ టౌన్, జూన్ 26: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం వృథాగానే ఉండి పోనుందా అనే ప్రశ్నలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసులను కలిచివేస్తున్నాయి. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో 5 డిసెంబర్ 2022లో రూ.11.5కోట్లతో 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం భవనానికి అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. జీప్లస్ వన్‌తో నిర్మించిన భవనంలో మాతా, శిశువుల పడకగదులు, వైద్యులు, సిబ్బంది, ఆపరేషన్, ల్యాబ్ తదితర గదులతో ఈభవనాన్ని కార్పొరేట్ దవాఖాన తరహాలో నిర్మించారు.
మాతాశిశు ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం పూరై దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నది. ప్రారంభం సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతోపాటు ప్రభుత్వం మారడంతో భవనం ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ప్రాంత వాసుల విన్నపం మేరకు మాతాశిశు ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆర్అండ్బీశాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
మాతాశిశుఆరోగ్యకేంద్రానికి అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టలేదు. ఈ ఆస్పత్రిలో గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, పిల్లలవైద్యనిపుణులు, ల్యాబ్‌టెక్నీషియన్స్, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలతోపాటు పలు విభాగాలకు చెందిన దాదాపు 80మందికి పైగా ఇందులో పనిచేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా మంజూరు చేయకుండా ప్రారంభించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 100 పడకల దవాఖానకు చెందిన సిబ్బందితోనే మాతాశిశు కేంద్రాన్ని నిర్వహిస్తారా లేక ప్రత్యేకంగా పోస్టులు మంజూరు చేస్తారనే విషయాన్ని అధికారులు సైతం వెల్లడించడం లేదు.