పాపన్నపేట, నవంబర్ 26: ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడి చెలరేగింది. ఏడుపాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడీ జరిగింది. రివాల్వర్‌తో బెదిరించి అగంతకులు హల్చల్ చేశారు. ఏడుపాయల్లో విందు ముగించుకుని సరదాగా పేకాడుతున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఆపై దర్జాగా రూ.2.50 లక్షలు దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధిలో కామారెడ్డి చెందిన ఆరెకటిక లక్ష్మణ్ పండుగ చేశాడు. ఈ పండుగకు సుమారు 60 మంది భక్తులు హాజరై హీరాలాల్ షెడ్డులో విందు చేసుకున్నారు. విందు అనంతరం సరదాగా పేకాడారు.
పది మంది దుండగులు హీరాలాల్ షెడ్డు గేటు దూకి లోనికి చొరబడ్డారు. కొందరు మొదటి గేటు వద్ద కాపలా ఉండగా, మరికొందరు రెండో గేటు వద్ద పహారా కాచారు. మరో ఆరుగురు షెడ్లోకి చొరబడ్డారు. దీంతో అందులోని కొందరు దొంగలుగా భావించి వారిని అడ్డుకున్నారు. ఇంతలోనే ఒకరు రివాల్వర్ తీసి భక్తులను బెదిరించారు. ఆ షెడ్డులో 60 మంది వరకు భక్తులు ఉన్నప్పటికీ రివాల్వర్ చూసి కిమ్మన లేకపోయారు. దుండగులు తొలుత సెల్ఫోన్లు లాక్కున్నారు. విందుకు వచ్చిన మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ రాజు దుండగులను అడ్డగించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో మిగతా భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. భక్తుల వద్ద ఉన్న ఉన్న నగదు సుమారు రూ. 2.50 లక్షలు దుండగులు తీసుకుని గోడదూకి పరారయ్యారు. ఏడుపాయల్లో ఇలాంటి ఘటనలు పలుసార్లు జరిగినా ఒక్కటి కూడా బయటకు పొక్కకపోవడం గమనార్హం.
మేము ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం కామారెడ్డికి చెందిన లక్ష్మణ్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యాం. విందు తర్వాత కొందరు సరదాగా పేకాడుతున్నారు. అదే సమయంలో పదిమంది వరకు దుండగులు వచ్చి తమను రివాల్వర్‌తో బెదిరించగా, అందరూ భయపడ్డారు. నేను దొంగలుగా భావించి ఎదుర్కొనే ప్రయత్నం చేశా. నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో నేను కూడా చేసేదేమీ లేక సరెండర్ అయ్యా. ఆపై దుండగులు మావద్ద ఉన్న 2.50 లక్షల నగదు ఎత్తుకొని పరారయ్యారు.
– ధర్మాకర్ రాజు, భక్తుడు, మెదక్