కోహీర్, ఆగస్టు 20: పంట రుణమాఫీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల హాజరు కాగా, పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు రుణమాఫీ వర్తింస్తుందా లేదా అని అధికారులతో మొరపెట్టుకొన్నారు. రెండు లక్షల రూపాయల కంటే తక్కువ అప్పు తీసుకున్నా తమకు రుణమాఫీ కాలేదని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు లక్షల రూపాయలకు పైగా తీసుకున్న రైతుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. దీంతో వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి భిక్షపతి స్పందించి.. రేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం పత్రాలతో ఏఈవోల వద్ద దరఖాస్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో నవీన్‌కుమార్, ఏఈవోలు శ్రీనివాస్, మౌనికవర్మ, సంధ్య, వేదవతి, సవిత, స్వాతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
నాకు వెంకటాపూర్‌లో 5.8 ఎకరాలు ఉంది. కవేలిలోని కెనరా బ్యాంకులో నాకు రూ.1.90లక్షల క్రాప్‌లోన్ ఉంది. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అవుతుందని చెప్పడంతో బ్యాంకు వచ్చి చూసే సరికి రుణమాఫీ లిస్టులో నాపేరు లేదు. ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తున్నాను. అయినా నాకు రుణమాపీ చేయలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..?
-ఉప్పరి నర్సింహులు, రైతు, కోహీర్ మండలం, సంగారెడ్డి జిల్లా