మద్దూరు(ధూళిమిట్ట),అక్టోబర్10: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మరో ఇరువురు మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. గ్రామానికి చెందిన కుంకటి లచ్చవ్వ-ఓజయ్య దంపతుల చిన్న కుమారుడు వెంకటయ్య ధూళిమిట్టలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. 1990లో తన 19వ ఏట వెంకటయ్య అప్పటి చేర్యాల పీపుల్స్‌వార్ దళ కమాండర్ బాలన్న ప్రోత్సాహంతో పీపుల్స్‌వార్‌లో చేరారు.
వెంకటయ్య పీపుల్స్‌వార్‌లో చేర్యాల దళంలో దళ సభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి మహదేవ్‌పూర్‌లో జిల్లా కమిటీ సభ్యుడిగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. అజ్ఞాతంలో కోడి మంజుల అనే సహచర మావోయిస్టును వివాహం చేసుకున్నారు. ఆమె గతేడాది వరంగల్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వం వెంకటయ్యపై అప్పట్లో రూ. 5లక్షల రివార్డును ప్రకటించింది. వెంకటయ్య తన తల్లిదండ్రులు మృతిచెందినప్పుడు కూడా గ్రామానికి రాలేదని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. అనారోగ్యంతో పాటు వివిధ కారణాలతో వెంకటయ్య పోలీసులకు లొంగిపోవడంతో ఆయన స్వగ్రామంలో గ్రామస్తులు, బంధువులు, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఊరును విడిచి వెళ్లి సుమారు 35 ఏండ్ల తర్వాత వెంకటయ్య తిరిగి వస్తుండడంతో గ్రామస్తులు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు.