న్యాల్కల్, జూలై 27 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రధాన సాగునీటి వనరులు ఉన్నా.. రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదు. కోట్లాది రూపాయలతో మండలంలోని అమీరాబాద్లో ఎత్తిపోతల పథకం, చినిగేపల్లి శివారులోని పెద్ద చెరువు నిర్మించినప్పటికీ అధికారుల నిర్లక్షం వల్ల దశాబ్దాలుగా నిరుపయోగంగా మారాయి. మం డలం మీదుగా ప్రవహించే మంజీరా నదిపై ఉన్న అమీరాబాద్ శివారులో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. నాబార్డు పథకం కింద 2002-03 లో రూ.1.38 కోట్లతో నిర్మించిన పథకం ద్వారా 500ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయకట్టును నిర్దేశించారు.
నాటి నుంచి నేటి వరకు ఒక్క ఎకరానికి చుక్క సాగునీరు పారిన దాఖలా లు లేవు. సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి చూసిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. ఏండ్ల తరబడి ఎత్తిపోతల పథకం పనిచేయక భూమిలోని ప్రధాన పైప్లైన్లు, పరికరాలన్నీ తుప్పుపట్టిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చినిగేపల్లి గ్రామ శివారులోని పెద్ద చెరువు నీటితో కళకళలాడుతున్నా సాగునీరు అందడం లేదు. మండలంలోని వడ్డి, డప్పూర్, శంశోల్లాపూర్ గ్రామాల్లోని వాగుల నుం చి ప్రవహిస్తున్న నీరు మంజీరానదిలోకి వెళ్తున్నది.
ఈ నీటిని నిల్వచేస్తే మరియంపూర్, రత్నాపూర్, చాల్కి, చినిగేపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని రైతులకు సాగునీరు అందించవచ్చని మండలంలోని చినిగేపల్లి శివారులో సీమాంధ్ర పాలన లో దాదాపు కోటి రూపాయలతో పెద్ద చెరువు నిర్మించారు. ఈ చెరువు పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 750 హెక్టార్లకు సాగు నీటిని అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లో అధికారులు సరైన ప్రణాళికలు లేకుండా చెరువును ఏర్పాటు చేయడంతో కుడి, ఎడమ కాల్వల నుం చి నీటి సరఫరాకు నోచుకోలేదు. గతంలో ఎడమ కాల్వ కింద మరియంపూర్ శివారులోని రైతులకు కొద్దిగా మాత్రమే సాగుకు నీటి సరఫరా జరిగింది. కుడి కాల్వ కింద మాత్రం చుక్కనీరు పారలేదు. చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మిషన్ కాకతీయ పథకం కింద రెండో విడతలో చెరువుకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.40 లక్షలతో పనులు ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నిర్ణయించిన వాటిని ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. పాత ఎత్తిపోతలు, చిన్ననీటి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో మండలంలోని ఆయా ప్రధాన సాగునీటి వనరులైన అమీరాబాద్ ఎత్తిపోతల, చినిగేపల్లి చెరువు పరిధిలోని ఆయకట్టు రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని సాగునీటి వనరులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారి స్తే దాదాపు 1,250 ఎకరాల్లో పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమీరాబాద్ ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకువస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన ప్రయోజనం లేకుండా పోతున్నది. వర్షాధారంపైనే ఆధారపడి రైతులు పంటలను పండించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పక్కనే మంజీరా నది ప్రహిస్తున్నా సాగుకు ఉపయోగప డటం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకువస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
– వైజ్యనాథ్, రైతు, అమీరాబాద్, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా