సిద్దిపేట, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యాసంస్థలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయాలి. సంగారెడ్డి జిల్లాలో 1461, సిద్దిపేట జిల్లాలో 381, మెదక్ జిల్లాలో 170 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 40శాతం బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు నిర్వహణ పూర్తి అయ్యింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బస్సుల ఫిట్నెస్ సరిగా లేక పోవడంతో గతంలో ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.
బస్సుల కండీషన్‌గా ఉంచాల్సిన బాధ్యత ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలదే. కానీ, వారు అడ్మిషన్లపై ఉన్న శ్రద్ధ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై చూపించడం లేదన్న విమర్శలున్నాయి. అడ్మిషన్లు, స్కూల్ బస్సు ఫీజుల పేరిట దండిగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ, బడి బస్సులపై శ్రద్ధ చూపించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరో పది రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. ఇంకెప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేయిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రవాణాశాఖ(ఆర్టీఏ) అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేయాలని కోరుతున్నారు.
అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి తక్కువ జీతం ఇచ్చి అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమించుకుంటున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు నడపాలంటే డ్రైవర్‌కు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండి తీరాల్సిందే. అతడి లైసెన్స్ చెక్ చేయాలి. ఏటా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ చేయాలి. రోడ్ ట్యాక్సీ, ఇన్సూరెన్స్, ఆర్సీ, ఇతర ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉండాలి.
బస్సు పదిహేను సంవత్సరాలు దాటితే స్కూల్‌కు వాడరాదు. కానీ, కాలం చెల్లిన పాత బస్సులకు రంగులు అద్ది ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీచేస్తే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యా లకు లొంగకుండా ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయడంతో పాటు అనుభవం లేని డ్రైవర్ల నియామకంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయా ఆర్టీఏ జిల్లా శాఖల పరిధిలో పాఠశాలల, కళాశాల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు జరుగుతున్నాయి. కానీ, కొన్ని విద్యాసంస్థలు ఫిట్నెస్ పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీరికి ఆర్టీఏ శాఖలోని కొంతమంది సిబ్బంది వంత పాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలం చెల్లిన వాహనాలకు రంగులు అద్ది తూతూమంత్రంగా పరీక్షలు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1461 బస్సులు, సిద్దిపేట జిల్లాలో 381, మెదక్ జిల్లాలో 170 స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. కానీ, ఇంత వరకు 40శాతం బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారు.
ఫిట్నెస్ పరీక్షలు జూన్ 12లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిట్నెస్ దాటాక ఆ బస్సులను నడిపితే వాటిని సీజ్ చేయడంతో పాటు స్కూల్ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంది. కానీ, అలా ఎక్కడా జరిగిన సందర్భాలు లేవు. బడి బస్సుల్లో కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రధానంగా అత్యవసర ద్వారం, మంటలు ఆర్పే పరికరాలు, ప్రథమ చికిత్స కిట్, అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు పగలగొట్టే గ్లాస్, కిటికీల వద్ద ఇనుప గ్రిల్స్, ఫైర్ అలారం, మంటలు ఆర్పే స్ప్రే ఉండాలి. ఇవికాకుండా పిల్లలు పట్టుకునే విధంగా నిలువు రాడ్లు ఏర్పాటు చేయాలి. ముందు, వెనుక భాగాల్లో లైట్లు, ఇండికేటర్లు, అద్దాలు ఉండాలి. తలుపుల వద్ద లాకింగ్ సిస్టం, పిల్లలు ఎక్కేందుకు వీలుగా ఫుట్‌బోర్డు పటిష్టంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి బస్సులో ఉండాల్సిందే.