తండాల్లో ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు మీ ఆడబిడ్డగా అడుతున్న.. అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా.. ఆలోచించి ఓటేయాలి. పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఓటర్లకు విజప్తి చేశారు. శుక్రవారం హవేళీఘనపూర్ మండలంలోని గంగాపూర్, శమ్నాపూర్, కొత్తచెరువు తండా, ఔరంగాబాద్ తండా, స్కూల్ తండా, లింగసాన్‌పల్లి తండా, బ్యాతోల్, పాతూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మెదక్ అర్బన్/ మెదక్ రూరల్, అక్టోబర్ 27: ‘ఆడబిడ్డగా అడుగుతున్న అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలో.. ఆలోచించి ఓటేయాలి.’ అని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హవేళీఘనపూర్ మండలంలోని గంగాపూర్, శమ్నాపూర్, కొత్తచెరువు తండా, ఔరంగాబాద్ తండా, స్కూల్ తండా, లింగసాన్‌పల్లి తండా, బ్యాతోల్, పాతూరు గ్రామాల్లో పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రచారం చేయడానికి వెళ్తే కొట్లాటలు తీసుకొచ్చే నీచమైన సంస్కృతి మంచికాదన్నారు. పదేండ్ల నుంచి పోలీస్ స్టేషన్లలో కేసులు లేకుండా ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయే ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. మైనంపల్లి హన్మంతరావు ఐదేండ్ల పాలనలో ప్రజలు నీళ్ల కోసం అరిగోసపడ్డారని గుర్తు చేశారు. ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారని, గ్రామాల్లో నీటి ఎద్దడి తీరిన తర్వాత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బోర్లు వేయించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సిలిండర్ ధరను రూ.1,200 పెంచగా, సీం కేసీఆర్ రూ.400కే సిలిండర్‌ను అందస్తామని మ్యానిఫెస్టోలో చేర్చినట్లు తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలల్లోనే హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అంటున్నాడని, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి రైతుబంధు ఆపేయాలని ఫిర్యాదు చేశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, రైతుబంధు బందు అవుతాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

13 ఏండ్లుగా మెదక్ నియోజకవర్గంలో కనిపించకుండాపోయి సడన్‌గా కొడుకు కోసం మెదక్ నియోజకవర్గానికి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నడని, ఆనాడు మెదక్ నాకు అవసరంలేదని మల్కాజిగిరికి వెళ్లిన హన్మంతరావుకు ఇప్పుడు మెదక్ ఎందుకోసం గుర్తుకువచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమేంతా జై తెలంగాణ అంటే మైనంపల్లి నై తెలంగాణ అని తెలంగాణకు అడ్డు పడలేదా.. అని ప్రశ్నించారు. కొడుకును ఎమ్మెల్యే చేయడానికి మైనంపల్లికి మెదక్ నియోజకవర్గం గుర్తుకువచ్చిందని రోహిత్‌కు హవేళీఘనపూర్ మండలంలో గ్రామాల పేర్లు, తండాల పేర్లు కూడా తెల్వదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన పద్మాదేవేందర్‌రెడ్డికి బ్యాతోల్, శమ్నాపూర్, గంగాపూర్తోపాటు గిరిజన తం డాల్లో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పటాకులు కాల్చు తూ ర్యాలీ పొడవునా పూలు చల్లారు. మహిళలు పద్మాదేవేందర్‌రెడ్డికి మంగళ హారతులు, బతుకమ్మలు, గిరిజనులు సాం ప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, హవేళీఘనపూర్ జడ్పీటీసీ సుజాత, ఎంపీపీ నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచు లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.