నారాయణఖేడ్, ఫిబ్రవరి 16: రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 60శాతం రైతులకు రైతుభరోసా రాలేదన్నారు. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. నాగల్గిద్ద మండలంలో మూడెకరాల్లోపు పట్టాదారులకు 13 వేల ఎకరాలకు రైతు భరోసా రావాల్సి ఉండగా, కేవలం 8 వేల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అయినట్లు తెలిపారు.
ఈ లెక్కన ప్రభుత్వం ఈ ఒక్క మండలంలోనే 40 శాతం పంట పెట్టుబడి సాయం ఎగబెట్టిందని మండిపడ్డారు. నాగల్గిద్ద మండలం శేరిదామరగిద్దలో 31 సర్వేనంబర్‌లో ఉన్న 525 ఎకరాలకు ఒక్క ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు వేయలేదన్నారు. ఈ సర్వే నంబర్లో గిరిజనులు, నిరుపేదలకు భూములు ఉన్నాయని, ప్రభుత్వ సహాయం పేద రైతులకు అందించకుండా పథకం లక్ష్యం నిర్వీర్యం అవుతోందన్నారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిన్న చిన్న సాంకేతిక లోపాలతో రైతుబంధు డబ్బులు జమకాకపోతే తాను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి లోపాన్ని సవరించి ప్రతి ఒక్కరికీ రైతుబంధు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి వెంటనే స్పందించి ప్రతి రైతుకూ రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి హెచ్చరించారు.